Mudragada Health Status: వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. తొలుత కాకినాడ కానీ.. రాజమండ్రి కానీ తరలించాలని భావించారు. అయితే హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని ముద్రగడ కోరినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. ముద్రగడ వయస్సు 75 సంవత్సరాలు దాటుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కుమారుడు వద్ద ఉంటున్నారు.
పవన్ ను ఓడిస్తానని శపధం..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీకి మద్దతుగా నిలిచారు ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ గెలవడంతో విపరీతంగా ట్రోల్స్కు గురయ్యారు ముద్రగడ. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా దరఖాస్తు చేసుకొని తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేస్తానని.. అంతవరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం తన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముద్రగడకు స్థానం కల్పించారు. ముద్రగడ కుమారుడికి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టారు.
కుటుంబంలో చీలిక..
ఇంకోవైపు ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేనలో( Janasena ) కొనసాగుతున్నారు. మొన్న ఆ మధ్యన తండ్రిని కలిసేందుకు వెళ్ళగా సోదరుడు అడ్డుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో కుమార్తె క్రాంతి తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను తన తండ్రిని కలిసేందుకు వెళ్తే సోదరుడు తరుపు బంధువులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెను వెంటనే ముద్రగడ పద్మనాభం పేరిట ప్రత్యేక ప్రకటన వచ్చింది. తాను ఎలాంటి అనారోగ్యంతో బాధపడడం లేదని.. తాను బాగానే ఉన్నానని ముద్రగడ వివరించే ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ కుటుంబంలో రాజకీయంగా చీలిక కనిపించింది. కానీ ఇప్పుడు ముద్రగడ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.