AP High Alert: ఏపీకి( Andhra Pradesh) తుఫాను ప్రమాదం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ మొంథా తీరానికి చేరువయ్యే కొలది ప్రళయంగా మారుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్.. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు మించి ప్రభావం చూపుతోందన్న అనుమానాలు, అంచనాలు ఉన్నాయి. ఈ తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు అతి భారీ వర్షాలు పడే సూచన కనిపిస్తోంది. మంగళవారం ఉదయానికి పెను తుఫాన్ గా మారి.. రాత్రికి తీరం దాటి పరిస్థితి కనిపిస్తోంది.
13 కిలోమీటర్ల వేగంతో..
అయితే ఇప్పటివరకు కాకినాడ( Kakinada) విశాఖ తీరాల మధ్య తీరం దాటుతుందని అంతా భావించారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎటువైపు దూసుకెళ్తుందో నన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీని ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. గంటకు 110 కిలోమీటర్ల వరకు గాలులు తీవ్రత పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఏపీవ్యాప్తంగా భారీగా వర్షాలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అధికార యంత్రాంగానికి దిశ నిర్దేశం చేశారు. తుఫాన్ సన్నద్ధతలో భాగంగా సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సమాచార లోపం లేకుండా చూడాలని ఆదేశించారు.
నిధుల కేటాయింపు..
మరోవైపు ఏపీ ప్రభుత్వం ముందుగానే నిధులు మంజూరు చేసింది. తుఫాన్ సహాయక చర్యల్లో ఎక్కడ ఇబ్బందులు రాకుండా ముందుగానే మేల్కొంది. సన్నద్ధతలో భాగంగా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు 19 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కోటి రూపాయల చొప్పున కేటాయించింది. చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు 50 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించింది. అలాగే అత్యవసర సహాయ నెంబర్లతో 122, 1070, 18004250101 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
మేల్కొన్న విపత్తుల నిర్వహణ సంస్థ..
ఏపీలో పరిస్థితుల దృష్ట్యా ముందుగానే అప్రమత్తం అయ్యింది విపత్తుల నిర్వహణ సంస్థ. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, ఎస్పీలతో హోంమంత్రి వంగలపూడి అనిత( home minister Anita) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే పునరుద్ధరించేందుకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, జెసిబి లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.