AP Heavy Rains: వణుకుతున్న ఏపీ.. భారీ వర్షాలు.. ప్రభుత్వం అలెర్ట్!

వర్షం అంటేనే ఏపీ ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. ఆగస్టులో భారీ వర్షాలు ఏపీని వణికించాయి. విజయవాడ నగరం వరద ముంపులో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు సాధారణ స్థితిలోకి వస్తున్నారు. ఇటువంటి తరుణంలో బంగాళాఖాతం మరో హెచ్చరిక పంపింది.

Written By: Dharma, Updated On : October 16, 2024 8:54 am

AP Heavy Rains

Follow us on

AP Heavy Rains: ఏపీకి బిగ్ అలెర్ట్. బంగాళాఖాతం నుంచి తీవ్ర హెచ్చరికలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. వాయువ్య దిశగా పయనిస్తోంది. రాగల 12 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడింది. అది మరింత బలపడి వాయుగుండం గా మారనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ వైపు పయనిస్తుందని.. అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు అధికారులు.

* ఈరోజు నుంచి వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. అన్ని జిల్లాల అధికారులను అలెర్ట్ చేసింది. కాకా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారులు పేర్కొంటున్నారు. రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఎల్లుండి మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ సూచించారు.

* హోం మంత్రి సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యల కోసం ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని.. ముఖ్యంగా భారీ వర్ష సూచన ఉన్న చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలో ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.