AP Health Policy: ఏపీ ప్రభుత్వం( AP government ) అద్భుత నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీని అందుబాటులోకి తేనుంది. దీనికి క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అయితే ఇది ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయడమేనని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం దీనిని తప్పుపడుతోంది. కానీ ఇదో అద్భుత పథకం అని కూటమి చెబుతోంది.
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, రాష్ట్రం అమలు చేస్తున్న ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ని అనుసంధానం.. రాష్ట్రంలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానమే ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ అమలయ్యేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా… ఈ హెల్త్ పాలసీని అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం.
* ఇది పాత పథకమే..
అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినది. కానీ జగన్ సర్కార్ అమలు చేయలేక పోయింది. 2023 డిసెంబర్లో ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచుతూ నాడు జగన్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంతలోనే అధికార మార్పిడి జరిగింది. ఈ పథకం అమలుకు నోచుకోలేకపోయింది. అయితే తాజాగా హెల్త్ పాలసీ కి సంబంధించి ప్రభుత్వమే బీమా మొత్తాన్ని కట్టనుంది. కానీ ఈ విషయంపై స్పష్టతనివ్వలేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకానికి ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు కూడా అంతే ఖర్చు కానుంది. కానీ ఓ 20 లక్షల కుటుంబాలు అత్యధిక ఆదాయం ఉన్నవారే. అటువంటి వారి కంటే కోటి 40 లక్షల కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం బీమా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఇది పేద ప్రజలకు ఉపశమనం కలిగించే విషయమే.
* కేవలం 6 గంటల్లో అనుమతులు..
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ( aarogyasree ) ద్వారా 3257 రోగాలకు సంబంధించిన సేవలు అందుతున్నాయి. అయితే తాజాగా ఈ హెల్త్ పాలసీ రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందం ఉంది. కేవలం 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ఫ్రీ ఆధరైజేషన్ మేనేజ్మెంట్ తీసుకురానుంది. రూ.2.5 లక్షల లోపు వైద్య చికిత్స క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం తీసుకురానుంది. రూ.2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యాయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది.
* వైద్య కళాశాలల ఏర్పాటు..
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఇది హైబ్రిడ్( hybrid) విధానం. 1.43 కోట్ల మంది పేద కుటుంబాలకు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించేలా సరికొత్త హెల్త్ పాలసీని అమలు చేయనున్నారు. మరోవైపు వైద్య కళాశాలల విషయంలో సైతం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేటు విధానంలో రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ,పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్వీర్యం చేయడమేనని జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. తమ హయాంలో ప్రభుత్వమే నేరుగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి నడిపితే.. ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని జగన్ మండిపడుతున్నారు. అయితే జగన్ హయాంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు చేయడం వాస్తవమే. కానీ వాటి నిర్మాణంలో మాత్రం చాలా జాప్యం జరిగింది. భూ సేకరణకు కూడా కొన్ని జిల్లాల్లో పరిస్థితి దాటలేదు. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ కళాశాలల నిర్మాణం పూర్తి చేసి పేద వైద్య విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని ప్రభుత్వ అభిమతంగా తెలుస్తోంది. అయితే నిపుణులు మాత్రం ఇది మంచి నిర్ణయమేనని చెబుతున్నారు. హెల్త్ పాలసీతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్ణయం సముచితమేనని వ్యాఖ్యానిస్తున్నారు.