AP Pensions: పింఛన్ల పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలివీ

జూలై 1న మొదటి రోజు లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సచివాలయ ఉద్యోగి 50 మందికి చొప్పున పింఛన్ అందించాల్సి ఉంటుంది.

Written By: Dharma, Updated On : June 27, 2024 10:01 am

AP Pensions

Follow us on

AP Pensions: ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ పై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఎలా ఉంటుందోనన్న అనుమానాలు ఉండేవి. వాలంటీర్ల ద్వారా అందిస్తారా? సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తారా? బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారా? అన్న అనుమానాలు ఉండేవి. కానీ సచివాలయ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కాల పరిమితి తో సహా మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. సామాజిక పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. వీరితో పాటు వివిధ లబ్ధిదారులకు సైతం పింఛన్ మొత్తం పెరిగింది. దీనిపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వృద్ధాప్య,వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తి వారు, ట్రాన్స్ జెండర్లు, ఏ ఆర్ టి,ఆర్టిస్టులకు 3000 నుంచి 4 వేలకు పింఛన్ మొత్తం పెరిగింది. దివ్యాంగులు, కుష్టు రోగులకు 3000 నుంచి 6 వేలకు పెంచారు. పూర్తి వైకల్యం ఉన్నవారికి 5000 నుంచి 15 వేలకు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారు, డయాలసిస్ రోగులు తదితరులకు 5000 నుంచి 10000 కు పెంచారు.

జూలై 1న మొదటి రోజు లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సచివాలయ ఉద్యోగి 50 మందికి చొప్పున పింఛన్ అందించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తం అందించాలని ఆదేశాలు వచ్చాయి. పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని.. జూలై నెల 4000 తో కలిపి మరో మూడు వేలు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెలలో 7000 అందిస్తారు. వచ్చే నెల నుంచి 4000 రూపాయలు అందించనున్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా అందించేవారు. ఇప్పుడు సచివాలయ సిబ్బందితో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక హెచ్ఐవి బాధితులకు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలో నగదు మొత్తాన్ని జమ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై రెండు నాటికి పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.