AP Free Gas: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో పడింది. ఇప్పటికే పింఛన్ మొత్తాన్ని పెంచింది. గత రెండు నెలలుగా అమలు చేస్తోంది. మిగతా పథకాలను సైతం ప్రాధాన్యత ప్రాజెక్టులుగా భావించి అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. మహిళల పథకాలపై సైతం ఫోకస్ పెట్టింది. మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రులు కొందరు ప్రకటనలు చేశారు. అటు ఆడబిడ్డ నిధికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరో కీలకమైన ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించే పనిలో పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం వర్తించదని తెలుస్తోంది. విద్యుత్ బిల్, ఆధార్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది ప్రభుత్వం. అయితే గ్యాస్ పథకానికి సంబంధించి ఎక్కువ మంది జై కొడుతున్నారు. మంచి పథకంగా చెబుతున్నారు. ప్రజల్లోకి ఈ పథకం బలంగా వెళుతుందని.. ప్రజలు కూడా ఆహ్వానిస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
* మంత్రి కీలక ప్రకటన
అసెంబ్లీలో ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఒక కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలో విధివిధానాలు రూపొందించి అమలు చేస్తామని కూడా సభాముఖంగా ప్రకటన చేశారు.సాధారణంగా ఐదుగురు సభ్యులు ఉండే కుటుంబానికి నెలకు ఒక గ్యాస్ సిలిండర్ అవసరం. ఈ లెక్కన ఏడాదిలో 12 గ్యాస్ సిలిండర్లు వినియోగించడం ఖాయం. మూడు నెలల ఉచితంగా అందిస్తే ఆ కుటుంబానికి దాదాపు 3 వేల రూపాయలు ఆదా చేసే అవకాశం ఉంది.
* సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యం
ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మహిళలని ఆయన టార్గెట్ చేసుకున్నారు. ఈ పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మహిళలు కూడా కూటమివైపు టర్న్ కావడానికి ఈ పథకాలే కారణం. అందుకే వీలైనంత మహిళా పథకాలకు సంబంధించి అమలు చేయాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. మహిళలు బలమైన ఓటు బ్యాంక్ నేపథ్యంలో.. వారి అభిమానాన్ని చూరగొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది.
* తెలంగాణలో అధ్యయనం
సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో ఈ పథకం అమలు అవుతోంది. అందుకే ఏపీ అధికారులు అధ్యయనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు విధివిధానాలను తెలుసుకున్నారు. ఇక్కడ వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తున్నారు. త్వరలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.