SC Sub Categorisation: ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రకంపనలు.. రాజకీయంగా ఎవరికి మేలు? ఎవరికి కీడు?

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎస్సీ వర్గీకరణకు జై కొట్టింది అత్యున్నత న్యాయస్థానం. అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఇది మాదిగలకు మోదం.. మాలలకు ఖేదం. దీంతో లాభనష్టాలను బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు.

Written By: Dharma, Updated On : August 1, 2024 2:13 pm

SC Sub Categorisation

Follow us on

SC Sub Categorisation: ఎస్సీ వర్గీకరణతో రాజకీయంగా ఎవరికి లాభం? తెలుగుదేశం పార్టీకా? వైసిపికా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. దీనిని కచ్చితంగా మాలలు వ్యతిరేకిస్తారు. మాదిగలు స్వాగతిస్తారు. ఎస్సీ రిజర్వేషన్లలో సింహభాగం ప్రయోజనాలను మాలలు పొందుతున్నారని.. మెజారిటీ సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. అందుకే ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని మాదిగలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ మాదిగల పోరాటాన్ని గుర్తించింది. ఎస్సీ వర్గీకరణకు సిద్ధపడింది. మాల మహానాడు నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినా.. ఆ వర్గం ఉద్యోగులు ఆందోళన చేసినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. 2000లో వర్గీకరణ అమలు చేసింది. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత.. 2004లో వర్గీకరణకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ నిలిచిపోయింది. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ ప్రయోజనాలతో కూడుకున్నది కావడం విశేషం. ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వెంట నడిచారు. ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. 1982లో టిడిపి ఆవిర్భవించినా.. అన్ని వర్గాలు ఆ పార్టీకి అండగా నిలిచాయి. కానీ ఎస్సీలు మాత్రం కాంగ్రెస్ గొడుగు వీడలేదు. ఆ పార్టీ వెంటే నడిచారు.ముఖ్యంగా ఏపీలో ఉన్న ఎస్సీలు టిడిపిని వ్యతిరేకించారు.అయితే ఎస్సీలను దరి చేర్చుకోవడానికి ఎన్టీఆర్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. వారు మాత్రం మారలేదు. తెలుగుదేశం పార్టీని ఆదరించలేదు.

* తెలంగాణలో మాదిగలు అధికం
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీలో మాలలు కంటే మాదిగలే అధికం. తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉంటే.. ఏపీలో మాత్రం మాలల సంఖ్య అధికం. టిడిపి ఆవిర్భావం తర్వాత మాలలతోపాటు మాదిగలు కాంగ్రెస్ వెంట నడిచారు. అయితే తమ రిజర్వేషన్ల ఫలాలను మాలలు తన్నుకు పోతున్నారని మాదిగలు ఆందోళన చేయడం ప్రారంభించారు. అలా 1997లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం ప్రారంభించింది. ఆ సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారు. అప్పుడే ప్లాన్ చేశారు. ఎస్సీల్లో మాదిగలను తమ వైపు తిప్పుకోవచ్చని భావించారు. ఎస్సీ వర్గీకరణకు జై కొట్టారు. అప్పటినుంచి మాదిగలు టిడిపికి అండగా నిలవడం ప్రారంభించారు.

* చంద్రబాబు రాజకీయం
తెలంగాణలో చాలామంది మాదిగ నేతలను ప్రోత్సహించారు చంద్రబాబు. రాజకీయంగా కూడా టికెట్లు ఇచ్చి కీలక పదవులు ఇచ్చారు. దీంతో ఎస్సీల్లో చీలిక తెచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందగలిగారు చంద్రబాబు. 1995లో ఎన్టీఆర్ నుంచి పదవిని చేజిక్కించుకున్న చంద్రబాబు 1999 ఎన్నికలను ఎదుర్కొన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ పుణ్యమా అని తెలంగాణలో ఉన్న మెజారిటీ మాదిగలు టిడిపికి అండగా నిలబడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి కారణమయ్యారు.

* జగన్ కు మరింత దగ్గరగా మాలలు
అయితే 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న మాలలను మరింత ఓటు బ్యాంకు గా మార్చుకునేందుకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించారు. అప్పట్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. మాల మహానాడు ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న ప్రచారం ఉంది. అప్పట్లో ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మాలలు మరింతగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. అయితే వైసీపీ ఆవిర్భావంతో మెజారిటీ మాలలు జగన్ కు జై కొట్టారు. 2019 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో అసలు టిడిపి గెలవలేదు. కానీ ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో సైతం టిడిపి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో మాదిగల సంఖ్య తక్కువే. అయినా సరే ఈసారి మాలలు మార్పు కోరుకున్నారు. టిడిపికి అండగా నిలిచారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మాత్రం మాలలు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. టిడిపిని వ్యతిరేకించే ఛాన్స్ కనిపిస్తోంది. వర్గీకరణ ఉద్యమానికి బీజం వేసింది చంద్రబాబు అన్న అనుమానం వారిలో ఉంది. ఈ తీర్పుతో అది మరింత రాజుకోనుంది.