AP Free Bus Scheme: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన స్త్రీ శక్తి పథకం ప్రారంభం కానుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం కల్పించనుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచితమని తేల్చి చెప్పింది. ప్రీమియం సర్వీసులుగా ఉన్న సూపర్ డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ స్టాప్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదని తేల్చేసింది. దీంతో ఇప్పుడు అన్ని రకాల బస్సుల్లోనూ మహిళల ప్రయాణానికి అనుమతించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల ప్రచారాలకు తెరతీసింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని కూటమి పార్టీలు ఎదురు దాడి చేస్తున్నాయి.
Also Read: రాహుల్ జీ.. ఎన్నిరోజులు ఈ కాకమ్మ కథలు!
* పూర్తి అధ్యయనంతోనే..
సూపర్ సిక్స్( super six ) పథకాల్లో భాగంగా చంద్రబాబు ఉచిత ప్రయాణ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా సన్నాహాలు చేశారు. కర్ణాటక తో పాటు తెలంగాణలో అమలవుతున్న ఉచిత ప్రయాణ పథకాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసింది. ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. అయితే తొలుత జిల్లాల వరకే ఉచిత ప్రయాణం అని ప్రచారం జరిగింది. దీంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రయాణ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే ఐదు రకాల బస్సులలో మాత్రమే ఉచితం అని ప్రకటించడం పై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. రాష్ట్రంలో చాలా పట్టణాలకు, నగరాలకు మధ్య ఆర్టీసీ కనెక్టివిటీ లేదు. ఇటువంటి తరుణంలో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి వెళితే 14 బస్సులు మారాల్సి ఉంటుందని.. ఇదే ఉచిత ప్రయాణ పథకం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. అందుకే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు షరతులు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల బస్సుల్లో ప్రయాణానికి అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని.. భాను సేఫ్ డ్రైవర్ గా ఉంటారని చెప్పిన చంద్రబాబు.. ఏడాది తరువాత పథకాన్ని అమలు చేస్తూ ఐదు రకాల సర్వీసులకు మాత్రమే ఎలా పరిమితం చేస్తారని ఆమె ప్రశ్నించారు.
* అంతర్ జిల్లా సర్వీసులు తక్కువే..
వాస్తవానికి ప్రీమియర్ సర్వీసులు గా ఉన్న సూపర్ డీలక్స్( super deluxe ), సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏసి బస్సులు మాత్రమే అంతర్ జిల్లాలతో కనెక్టివిటీ ఉంటాయి. పల్లె వెలుగులు 50 నుంచి 100 కిలోమీటర్ల ప్రయాణానికి పరిమితం అవుతాయి. ఎక్స్ప్రెస్లు సైతం రెండు మూడు జిల్లాల మధ్య మాత్రమే నడుస్తాయి. అటువంటప్పుడు ప్రీమియం సర్వీసులో ఉచిత ప్రయాణం లేనప్పుడు.. మహిళలకు ఇబ్బందులు తప్పవు. తిరుపతి తో పాటు ఇతర నగరాలకు వెళ్లినప్పుడు బస్సులు మారాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన మహిళలు తిరుపతి వెళ్లాలంటే దాదాపు 14 బస్సులు మారాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనినే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఉచిత ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని.. జిల్లాలకు పరిమితం చేయలేదని తెలుగుదేశం కూటమి చెబుతోంది. ఇది ప్రజలను రెచ్చగొట్టడమేనని ఆరోపిస్తోంది. తప్పకుండా ఈ ఉచిత ప్రయాణ పథకంతో మహిళలు సంతృప్తి చెందుతారని అభిప్రాయపడుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ఆరోపణలు చేస్తోంది.
* ఎవరి అంచనాలు వారివి…
ఉచిత ప్రయాణ( free travelling) పథకం ప్రారంభం అయితే అంతా సర్దుబాటు అవుతుందని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంతకుముందు జిల్లాలకే ఉచిత ప్రయాణ పథకం పరిమితం చేస్తారని ప్రచారం నడిచింది. కానీ దానిని తెరదించుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసుకునే వీలు కల్పించారు. దీంతో మహిళల నుంచి కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పించడం సాహసోపేత నిర్ణయమే. అయితే అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించాలన్న డిమాండ్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత ప్రయాణ పథకం మాదిరిగానే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. అయితే ఇది కూటమికి మైనస్ అవుతుందని ప్రత్యర్థి వర్గాలు అంచనా వేస్తుండగా.. సానుకూలత ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో..?