India Post: దేశంలో అత్యంత పురాతనమైన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ పోస్టల్( Indian Postal). అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో పోస్టల్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖ సైతం మెరుగైన సేవలు అందిస్తూ వస్తోంది. ఇంకా ప్రజల మన్ననలు అందుకుంటోంది. కేవలం సమాచార సేవలే కాకుండా.. ప్రజలకు అవసరమైన సత్వర సేవలు సైతం అందిస్తోంది. ఆర్థికమైన ప్రోత్సాహానికి గాను.. పొదుపు పథకాలతో పాటు ఖాతాదారుల బీమాకు పెద్దపీట వేస్తోంది. అటువంటి పోస్టల్ శాఖలో పురాతనమైన సేవ నిలిచిపోనుంది. రిజిస్టర్ పోస్టు సేవ.. స్పీడ్ పోస్ట్ లో విలీనం కానుంది. నిజంగా ఇది బాధాకరమే.
Also Read: ఉచిత బస్సు ప్రయాణం… కూటమి ప్రభుత్వానికి అదే పెద్ద మైనస్ కానుందా?
* ప్రజలతో మంచి బంధం..
ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా.. ముఖ్యమైన పత్రాలు చేరవేయాలన్నా పోస్ట్ కార్డు లేదా రిజిస్టర్ పోస్టు( register post) మాత్రమే దిక్కు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లో పోస్టల్ వ్యవస్థ ప్రజా జీవితంతో విడదీయరాని భాగంగా ఉండేది. అయితే కాలంతో పాటు పోస్టల్ శాఖ సైతం ఆధునిక సేవలతో ముందుకు వస్తోంది. అందులో భాగంగానే బ్రిటిష్ కాలం నాటి నుంచి కొనసాగుతూ వస్తున్న రిజిస్టర్ పోస్ట్ సేవలను నిలిపివేయనుంది. స్పీడ్ పోస్ట్ తో కలిసి పోనుంది. ఆగస్టు 30తో ఈ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్ట్ అనే ప్రత్యేక సేవ పోస్టల్ డిపార్ట్మెంట్లో కనిపించదు.
* బ్రిటీష్ కాలం నాటి నుంచి..
రిజిస్టర్ పోస్టు సేవ ఈనాటిది కాదు. 1854లో బ్రిటీష్ ఎంపైర్ లార్డ్ డల్హౌసి( Lord Dalhousie ) రిజిస్టర్ పోస్టును ప్రారంభించారు. నిర్విరామంగా ఈ రిజిస్టర్ పోస్టు 171 సంవత్సరాలు దేశ ప్రజలకు సేవలు అందించింది. ముఖ్యమైన పత్రాలు, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. ప్రధానంగా లీగల్ నోటీసులు, అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఇలా పంపించిన వస్తువు అవతల వారికి చేరినట్లు రసీదు పొందడం దీనిలో ఉన్న ప్రత్యేకత. ఇది చాలా రకాలుగా ఉపయోగపడింది కూడా.
* సంస్కరణల దిశగా..
పోస్టల్ శాఖ మరింత సంస్కరణల దిశగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే రిజిస్టర్ పోస్టును స్పీడ్ పోస్ట్ లో విలీనం చేసినట్లు తెలుస్తోంది. పనితీరును మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్థను( tracking system) బలోపేతం చేయడం ఈ విలీనం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు. స్పీడ్ పోస్ట్ ప్రధానంగా వేగవంతమైన డెలివరీకి ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ సేవలు స్వీట్ పోస్టులో కలపడం వల్ల డెలివరీలు మరింత వేగవంతంగా చేరుతాయి. ముఖ్యంగా స్పీడ్ పోస్ట్ ద్వారా మీ పార్సిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్లైన్లో చెక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఈ సౌలభ్యం రిజిస్టర్ పోస్టులో ఉండదు. అయితే ఎక్కువగా రిజిస్టర్ పోస్టులను ఆశ్రయించేది ప్రభుత్వ శాఖలు. అందుకే అన్ని రకాల ప్రభుత్వ శాఖలకు సమాచారం ఇచ్చింది పోస్టల్ శాఖ. సెప్టెంబర్ 1 నుంచి కేవలం స్పీడ్ పోస్ట్ మాత్రమే అందుబాటులో ఉంటుందని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
* చార్జీల విషయంలో ఆందోళన..
అయితే రిజిస్టర్ పోస్టు రద్దు కావడంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. రిజిస్టర్ పోస్టు అనేది సులభతరమైన, సరళతరమైన ఒక విధానం. తక్కువ చార్జీతో తమ పత్రాలతో పాటు వస్తువులను పంపించేవారు ప్రజలు. అదే స్పీడ్ పోస్ట్( speed post) విషయానికి వచ్చేసరికి చార్జీ అధికంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో పోస్టల్ శాఖ ప్రజల విన్నపాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ చార్జీలతోనే స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.