AP Free Bus Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు సంక్షేమ పథకాల అమలు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సంక్రాంతి నాటికి కీలక సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూస్తోంది. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం పై దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అటు రవాణా శాఖ అధికారుల సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కొన్ని రకాల ప్రతిపాదనలు కూడా చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఈ పథకం ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించారు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలుకానుందని ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ హామీని అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం కలిగించడమే కాదు ప్రైవేటు వాహనాలకు ఇబ్బంది లేకుండా మార్గదర్శకాలు రూపొందించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు.
* సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా..
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇచ్చింది. అక్కడి ప్రజలు ఆహ్వానించారు కూడా. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించారు. అదే ఫార్ములాతో తెలంగాణ ఎన్నికల్లో ముందుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అని ప్రకటించారు. అక్కడ కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఆ పథకాన్ని అక్కడ అమలు చేసింది రేవంత్ సర్కార్. ఇప్పుడు అదే హామీని ఇచ్చారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూడా ఆదరించారు. అందుకే ఆ హామీ అమలకు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు.
* ఒక్కొక్కటి ప్రాధాన్యతాంశంగా
ఇప్పటికే పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. మూడు నెలల పాటు పింఛన్ బకాయిలను కూడా అందించగలిగారు. మరోవైపు ఉచిత గ్యాస్ పథకాన్ని కూడాఅమలు చేసి చూపించారు. ఇంకోవైపు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలకు కేటాయింపులు కూడా చేశారు. పింఛన్ల తో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వీలైనంత త్వరగా అమలు చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ విప్ సోషల్ మీడియాలో ఈ పథకానికి సంబంధించి ప్రకటన చేయడం వైరల్ గా మారింది. తప్పకుండా సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు అవుతుందని ఆశాభావంతో ఉన్నారు ప్రజలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.