AP: సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం( seashore area ) ఏపీ సొంతం. తిరుపతి జిల్లా తడ నుంచి.. శ్రీకాకుళం జిల్లా డొంకూరు వరకు దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. వేలాది గ్రామాలు ఉండగా.. లక్షలాదిమంది మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ జీవనం పొందుతున్నారు. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప.. మత్స్యకారులకు స్వాంతన చేకూరే ప్రాజెక్టులు కానీ.. పథకాలు కానీ లేకుండా పోతున్నాయి. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. దీంతో ఉపాధి లేకుండా పోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రెండు నెలల పాటు వారు శాశ్వతంగా ఉపాధికి దూరం కానున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే పరిస్థితి లేదు. సోమవారం అర్ధరాత్రి నుంచి చాపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఈనెల 15 నుంచి జూన్ 15 వరకు.. 61 రోజులపాటు వేట నిషేధం అమల్లో ఉంటుంది.
Also Read: జగన్ హత్యకు ప్లాన్.. మాజీ ఐపీఎస్ సూత్రధారి.. ఆప్తుడి సంచలనం!
* నిషేధం ఎందుకంటే?
సాధారణంగా వేసవి( summer ) మత్స్య సంపద ఉత్పత్తి అయ్యే కాలం. అందుకే రెండు నెలల పాటు చేపల వేట పై నిషేధం విధిస్తారు. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను నిలిపి వేస్తారు. ఈ సమయంలో మరో బోట్లు, ఇంజన్ బోట్లతో వేట నిషేధం. అయితే సంప్రదాయంగా ఉండే కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం చర్యలు తీసుకుంటారు. ఈ రెండు నెలల పాటు అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. మత్స్యకారులు నిబంధనలు తప్పితే మాత్రం కేసులు నమోదు చేస్తారు. అలా కేసులో నమోదయ్యే మత్స్యకారులు ప్రభుత్వ పథకాలకు దూరం అవుతారు.
* పెరిగిన నిషేధ సమయం..
రెండు నెలల పాటు మత్స్యకారులు జీవనోపాధికి దూరం కావడంతో ప్రభుత్వాలు భృతి కల్పిస్తూ వస్తున్నాయి. గతంలో చేపల వేట నిషేధ సమయం 40 రోజులు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని 60 రోజులకు పెంచారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు బియ్యం ఉచితంగా అందించేవారు. అటు తర్వాత బియ్యం స్థానంలో భరోసా పేరిట నాగదు అందించడం ప్రారంభించారు. 2014లో టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యానికి బదులు రూ.2000 చొప్పున సాయం అందించింది. కొద్ది రోజులకే ఆ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచింది. అయితే 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార భరోసాను రూ. 10 వేలకు పెంచడం విశేషం.
* రెట్టింపు భృతి..
2024లో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలలోనే భాగంగా మత్స్యకార భరోసాను రెట్టింపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తరువాత.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక జీవో ఇచ్చారు. 20వేల రూపాయల చొప్పున మత్స్యకార భరోసా అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు. ఈ నెలలో కానీ.. వచ్చే నెలలో కాని మత్స్యకారులకు భరోసా అందే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు.
Also Read: ఆమె విషయంలో తోక ముడిచిన వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా