AP Fake Pensions: ఏపీలో ( Andhra Pradesh) లక్ష పింఛన్లు తొలగించనున్నారా? లక్ష మంది అనర్హులుగా తేల్చారా? వారందరికీ పింఛన్లు తొలగించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీగా బోగస్ పింఛన్లు నమోదైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి తప్పుడు ధృవీకరణ పత్రాలతో లక్షల పింఛన్లు పక్కదారి పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బోగస్ పింఛన్లపై దృష్టి పెట్టింది. వైద్యుల బృందాలను నియమించి పింఛన్ లబ్ధిదారుల వైకల్య పరీక్షలను నిర్ధారించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు తేలింది. వారందరి పింఛన్లు తొలగించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇదో సంచలన అంశంగా మారే అవకాశం ఉంది.
* వైద్యుల బృందం తనిఖీ..
రాష్ట్రవ్యాప్తంగా 7.86 లక్షల మంది దివ్యాంగ పించన్ దారులు( physically handicapped pensioners ) ఉన్నారు.రూ.6000, పదివేలు, పదిహేను వేలు చొప్పున అందుకుంటున్నారు. పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు ఉన్నాయని అనుమానిస్తూ కూటమి ప్రభుత్వం వైద్యుల బృందంతో వీరికి తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వం నోటీసులు అందించి వీరికి వైద్య పరీక్షలు చేయించింది. అయితే చాలామంది ఈ పరీక్షలకు రాకుండా దూరంగా ఉండిపోయారు. అయితే వచ్చిన వారిలో కూడా ఎక్కువమంది అనర్హులని తేలిందట. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ, సెర్ఫ్ అధికారుల ఆధ్వర్యంలో దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్న వారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి పరీక్షలు చేయించుకోవాలని సమాచారం ఇచ్చారు. అయితే వీరిలో 50వేల మంది అసలు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాలేదు. మిగిలిన వారిలో దాదాపు 3 లక్షల మందికి వైకల్యాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మిగిలిన వారిలో 60 వేల మందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం, మరో 40,000 మందికి వైకల్యం ఉన్న కోలుకునే అవకాశం ఉంది అని తేలినట్లు తెలుస్తోంది. నవంబర్ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. అటు తరువాత ఏరివేత కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
* ఆ మూడు జిల్లాల్లో అధికం..
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే విజయనగరం( Vijayanagaram), తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువమంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో శ్రీకాకుళం, కృష్ణా, శ్రీ సత్యసాయి జిల్లాలు ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలామంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి పింఛన్ పొందినట్లు తేలింది. వైకల్య నిర్ధారణకు సంబంధించి 15 వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు అప్పట్లో వైసీపీ నేతలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రతి నెల 15 వేల రూపాయలు చొప్పున పింఛన్ తీసుకునేవారు మొత్తం 24 వేల మంది ఉన్నారు. వారిలో 23,763 మందికి పరీక్షలు చేశారు. అయితే 13వేల మంది అనర్హులు అని తేలడం షాకింగ్ విషయం. అయితే వీరి పింఛన్ విషయంలో ఏం చేయాలని దానిపై అధ్యయనం చేస్తోంది కూటమి ప్రభుత్వం.
* లక్షలాదిమంది అనర్హులు..
రాష్ట్రవ్యాప్తంగా 6 వేల రూపాయల మొత్తం పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులు 7.86 లక్షల మంది ఉన్నారు. పరీక్షలకు పిలిచిన వారి సంఖ్య 4.50 లక్షలు. అయితే ఓ 50 వేల మంది హాజరు కాలేదు. అయితే వైకల్య సమస్య ఉన్నవారు రెండు లక్షల మంది కాగా.. అనర్హులు లక్ష మంది వరకు ఉన్నట్లు తేలింది. వీరి పింఛన్లు తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వస్తే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ బోగస్ పింఛన్లు రద్దు చేసి.. కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బోగస్ పింఛన్లు రద్దు చేస్తే మాత్రం ఇదో సంచలనాంశంగా మారనుంది.