AP Employees Salaries: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. మరోవైపు ఉపాధ్యాయుల విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తోంది. వారి బదిలీలకు పచ్చ జెండా ఊపింది. తాజాగా జూనియర్ కాలేజీ లెక్చరర్ లకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ప్రిన్సిపాళ్లుగా వారికి పదోన్నతులు ఇవ్వనుంది. గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాలను కూడా భారీగా పెంచింది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. మరోవైపు పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మెగా డీఎస్సీ నిర్వహణలో కూడా నిమగ్నం అయింది. ఇలా విద్యాశాఖ కీలక నిర్ణయాలు, మార్పులు, చేర్పులతో ముందుకు సాగుతోంది.
Also Read: చుట్టూ శత్రువలే.. అయినా ఇప్పటి వరకూ ఓటమెరుగని దేశం.. ఇజ్రాయెల్ విజయరహస్యమిదీ
* దశాబ్దాలుగా ఎదురుచూపు..
దశాబ్దాల కాలంగా జూనియర్ కాలేజీ అధ్యాపకులు( Junior College lecturers ) పదోన్నతులు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 61 మంది లెక్చరర్లకు ప్రిన్సిపాల్ గా పోస్టింగులు ఇస్తూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతిక శుక్ల ఆదేశాలు జారీ చేశారు. జోన్ 1 లో 15, జోన్ 2 లో 14, జోన్ 3 లో 11, జోన్ 4 లో 21 మందికి పదోన్నతులు కల్పించారు. మొత్తం 61 మందికి లెక్చరర్ల నుంచి ప్రిన్సిపాల్ గా పోస్టింగులు దక్కాయి. దానికి తగిన విధంగా జీతాలు కూడా పెరగనున్నాయి.
* గెస్ట్ ఫ్యాకల్టీ కి సైతం..
మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ( guest faculty) జీతాలు కూడా భారీగా పెరిగాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గంటకు రూ.150 ఇస్తుండగా.. దీనిని రూ.375 కు పెంచారు. గరిష్టంగా నెలకు 27 వేల రూపాయల జీతం ఇవ్వనున్నారు. జీతాలు పెంచాలని గత కొన్నేళ్లుగా బెస్ట్ ఫ్యాకల్టీ కోరుతూ వచ్చింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
* హెచ్ఎం లకు శిక్షణ..
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు( headmasters ) శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఈనెల 19 నుంచి 23 వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. ఏలూరు జిల్లా అగ్రిపల్లి మండలంలోని హీల్ పారడైజ్ లో రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం అయింది. వెబ్ సైట్ తో పాటు మన మిత్ర వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పాఠశాల విద్యాశాఖ సూచించింది. పరీక్షలను ఈనెల 19 నుంచి 28 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. మరోవైపు మెగా డీఎస్సీకి మూడు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.