AP electricitybill refund: తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని తెలుగుదేశం కూటమి( Telugu Desam Alliance ) ప్రజలకు హామీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచేది లేదని మంత్రులు సైతం ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించామని.. అదనంగా వసూలు చేశామని చెబుతోంది కూటమి ప్రభుత్వం. తిరిగి వినియోగదారులకు ట్రూ డౌన్ పేరుతో రూ.449.60 కోట్లు తిరిగి చెల్లించేందుకు డిస్కంలు సిద్ధపడుతున్నాయి. అంటే విద్యుత్ చార్జీలు పెంచినట్టే కదా. పెంచకుండా తిరిగి అన్ని వందల కోట్లు డిస్కం లు ఎందుకు చెల్లిస్తాయి? అన్నదే ఇప్పుడు ప్రశ్న. కూటమి ప్రభుత్వం అంకెల గారడి చేస్తుందా అన్న అనుమానం కూడా ఉంది. దీనిపై విద్యుత్ రంగ నిపుణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మతలబును బయట పెడుతున్నారు.
Also Read: రాజధాని ఎక్కడ ‘బాబు’.. షర్మిల సెటైర్ వైరల్
గత ఆర్థిక సంవత్సరంలో బాదుడు..
2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల( electric charges) పేరిట పెద్ద ఎత్తున వసూలు చేసింది కూటమి ప్రభుత్వం. అప్పట్లోనే విద్యుత్ కొనుగోళ్లలో తేడాలు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డిస్కం లు ఈ వ్యత్యాసాన్ని ఎఫ్పిపిసిఏ కింద లెక్కించినట్లు చెబుతున్నాయి. అప్పట్లో కొన్ని డిస్కం లు ట్రూ అప్ కింద రూ.842.68 కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించాయి. అయితే ఈపీడీసీఎల్ మాత్రం రూ.1292.28 కోట్లు ట్రూ డౌన్ కింద తిరిగి చెల్లించాలని కోరింది. విద్యుత్ కొనుగోలుకు అయిన ఖర్చు… వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం వేరువేరుగా ఉంటాయి. ఈ తేడాను డిస్కంలు ఎఫ్పిపిసిఏ ద్వారా సరిచేస్తాయి. అలా సరిచేసి ఇప్పుడు తిరిగి అందిస్తున్నట్లు డిస్కములు చెబుతున్నాయి.
Also Read: అదానీకి ఏపీలో మూడినట్టే.. లొల్లి మొదలైందిగా
వసూలు కొండంత.. ఇచ్చింది కొసరంత
అయితే డిస్కం లు( discoms ) వినియోగదారుల నుంచి ఎఫ్పిపిసిఏ పేరుతో యూనిట్కు 40 పైసలు అప్పట్లో అదనంగా వసూలు చేశాయి. ఇలా మూడు డిస్కం లు కలిపి రూ.2782.19 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తంలో ఇప్పుడు రూ.449.60 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమిటనేది విద్యుత్ రంగ నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. వినియోగదారుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడి.. ఇప్పుడేమో వినియోగదారులకు ఉదారంగా అందిస్తున్నట్లు విద్యుత్ శాఖ చెబుతోంది. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీలు పెరుగుతూ వచ్చాయి. అయితే వాటికి రకరకాల పేర్లు పెట్టి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా పెంచుకుపోయిన విద్యుత్ చార్జీల విషయంలో సరైన ప్రామాణికం లేదు. ఎలా పెరిగాయో కూడా వినియోగదారుడు కి తెలియడం లేదు. ఒక్కోనెలా ట్రూ ఆప్ అన్నారు. ఇప్పుడు ట్రూ డౌన్ అంటున్నారు. ఈ చార్జీల వెనుక ఉన్న కిరికిరి ఏంటో మాత్రం సామాన్య జనాలకు అర్థం కావడం లేదు. గతం మాదిరిగా ప్రతిపక్షాలతో పాటు వామపక్షాలు సైతం విద్యుత్ చార్జీలపై పోరాటం చేయడం లేదు. దీంతో ప్రభుత్వం ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టు పరిస్థితి మారింది.