AP Elections 2024: ఆ ఓట్లపైనే టిడిపి ఆశలు.. వదలని వైసిపి!

గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీకి ప్రత్యర్థులుగా మారారు. గత ప్రభుత్వాలుకల్పించిన రాయితీలు, ఇతరత్రా వసతులను సైతం వైసీపీ సర్కార్ నిలిపివేసింది.

Written By: Dharma, Updated On : June 1, 2024 2:23 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అంతకంటే ముందే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. దీంతో ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో 80% ఓట్లు తమకే దక్కాయని టిడిపి అంచనా వేస్తోంది. అందుకే కీలక నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గట్టెక్కవొచ్చని భావిస్తోంది. అయితే దానికి చెక్ చెప్పాలన్న ప్రయత్నంలో వైసిపి ఉంది.

గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీకి ప్రత్యర్థులుగా మారారు. గత ప్రభుత్వాలుకల్పించిన రాయితీలు, ఇతరత్రా వసతులను సైతం వైసీపీ సర్కార్ నిలిపివేసింది. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సిపిఎస్ ను అలానే వదిలేసింది. ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద బాధ్యతలు అప్పగించింది. పాఠశాలలనువిలీనం చేసింది.ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. జీతాలు సక్రమంగా చెల్లించలేదు. ఇన్ని పరిణామాల క్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని భావించారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసినట్లు టిడిపి అంచనా వేస్తోంది.

అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకు వ్యతిరేకమని భావించిన వైసిపి కొత్త వ్యూహంతో ముందుకు సాగింది. గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు.. రిటర్నింగ్ అధికారి సీల్, హోదా లేకపోయినా పర్వాలేదని ఎలక్షన్ కమిషన్ మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో తమకు ముప్పు తప్పదని వైసిపి భావించింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే ఈ విధానం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కిరణ్మయి ప్రతాప, జస్టిస్ న్యాపతి విజురులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలువినింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది. తీర్పు అనుకూలంగా వస్తే వైసిపికి పరవాలేదు.. కానీ ప్రతికూలంగా వస్తే మాత్రం టిడిపి కూటమికి భారీ ఊరట దక్కనుంది. కీలక నియోజకవర్గాల్లో కూటమి గెలుపునకు మార్గం సుగమం కానుంది.