AP Elections 2024: రాయల సీమలో రికార్డుస్థాయిలో పోలింగ్‌.. ఎవరికి అనుకూలమో..

ఏపీలోని రాయలసీమలో ఓటింగ్‌ శాతం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా నమోదైంది.ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం సమయంలో కాస్త రద్దీ తగ్గినట్లు కనిపించింది.

Written By: Raj Shekar, Updated On : May 14, 2024 5:47 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రికార్డు సృష్టించాయి. ఏపీలో ఏకంగా రికార్డు స్థాయిలో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. గతంలో ఎన్నడు జరుగని విధంగా మే 13వ తేదీ అర్ధరాత్రి దాటే వరకు చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఓట్లు వేశారు. దీంతో పెరిగిన పోలింగ్‌ ఎవరికి అనుకూలమో అన్న చర్చలు ఇప్పుడు ఏపీలో జోరుగా సాగుతున్నాయి.

రాయల సీమలో భారీగా ఓటింగ్‌..
ఇక ఏపీలోని రాయలసీమలో ఓటింగ్‌ శాతం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా నమోదైంది.ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం సమయంలో కాస్త రద్దీ తగ్గినట్లు కనిపించింది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మళ్లీ పోలింగ్‌ కేంద్రాలో ఓటర్లతో కిటకిటలాడాయి. 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసినా అప్పటికే చాలా కేంద్రాల్లో క్యూలైన్లు కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపించాయి. క్యూలైన్లలో ఉన్న అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.

మహిళలు, యువతలో చైతన్యం..
సార్వత్రిక ఎన్నికల్లో రాయల సీమలో మహిళలు, యువతలో ఓటు చైతన్యం ఎక్కువగా కనిపించింది. సాయంత్రం బారులు తీరినవారిలో మహిళలు, యువతే ఎక్కువగా కనిపించింది. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో గతంలో కంటే ఎక్కువగా 78.71 శాతం పోలింగ్‌ నమోదైంది. కర్నూలు జిల్లాలోనూ పొలింగ్‌ శాతం భారీగా పెరిగింది. 75.83 శాతం, నంద్యాలలో గతంలో మాదిరిగానే 80.92 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. చిత్తూరులో 82.65 శాతం, సత్యసాయి జిల్లాలో 82.40 శాతం, పల్నాడులో 78.70 శాతం, అన్నమయ్య జిల్లాలో 76.12 శాతం పోలింగ్‌ నమోదైంది. నెల్లూరు జిల్లాలో 78.10 శాతం మంది ఓటేశారు. దాదాపు రాయలసీమ అంతటా 75 శాతం పైనే పోలింగ్‌ నమోదైంది.