AP DSC: ఏపీలో( Andhra Pradesh) ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈనెల 20 కానీ.. 23న కానీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల నుంచి 404 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వయోపరిమితి పెంపు ఈ మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. కటాఫ్ తేదీని 2024, జూలై 1గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై డీఎస్సీ అభ్యర్థుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయంతో వేలాదిమంది అభ్యర్థులకు ప్రయోజనం కలగనుంది. చాలా రోజుల తర్వాత డిఎస్సీ నియామక ప్రక్రియ జరుగుతుండడంతో.. వయోపరిమితితో చాలామంది దూరమయ్యే అవకాశం ఉంది. వారి విజ్ఞప్తి మేరకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ.. షెడ్యూల్ ఇలా!
* భారీగా పోస్టులు పెంచుతూ.
తాము అధికారంలోకి వస్తే మెగాడీఎస్సీ( Mega DSC ) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 16347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ పరిధిలో 170, ఎస్టి సంక్షేమ శాఖ పరిధిలో 2024 ఖాళీలు ఉండనున్నాయి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉన్నాయి.
* తొలి ఫైల్ గా డీఎస్సీ పై..
అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఫైల్ గా డీఎస్సీ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు( CM Chandrababu). మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఇంతలో ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. వర్గీకరణ జరిగిన తరువాత డీఎస్సీ ప్రక్రియ చేపట్టాలన్న డిమాండు వచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పై వేసిన కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 20న కానీ.. 23 న కానీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను.. భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమగ్రంగా సేకరించింది. ఇది ఒక కొలిక్కి వచ్చిన మరుక్షణం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
* వేలాది మంది అభ్యర్థన మేరకు..
2019 ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). ఏటా డీఎస్సీ ప్రక్రియ చేపడతామని చెప్పుకొచ్చారు. కానీ ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు. దీంతో గత ఐదేళ్లుగా లక్షలాదిమంది అభ్యర్థులు ఎదురుచూశారు. దీంతో చాలామంది వయోపరిమితి దాటిపోయింది. 42 ఏళ్లు దాటిన వారు వేలల్లో ఉన్నారు. అటువంటి వారు విజ్ఞప్తి చేయడంతో కూటమి ప్రభుత్వం వయోపరిమితి విషయంలో సడలింపు ఇచ్చింది. రెండేళ్లపాటు వయసు పరిమితిని పెంచింది. ఈ నిర్ణయంతో వేలాదిమందికి లాభం చేకూరనుంది.
Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!