AP DSC 2025 : డీఎస్సీ( DSC ) ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఏపీలో ప్రారంభం అయింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వివాహిత మహిళా అభ్యర్థులను అప్రమత్తం చేశారు. వారు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటి పేరుతోనే అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ లోనే తమ అర్హతను బట్టి ఎన్ని పోస్టుల కైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. అయితే ఒక పోస్టు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : ఏపీ డీఎస్సీ.. దరఖాస్తు సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
* భారీ ఉపాధ్యాయ పోస్టులతో..
రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం( AP government) డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీ మేరకు 16 వేలకు పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. నిర్ణీత సమయానికి ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తికానుంది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఈ ఏడాది జూలై నాటికి ఉపాధ్యాయ నియామకాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి ఒక డెమో విడుదల చేశారు. దరఖాస్తుల ప్రక్రియలు అభ్యర్థులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
* వైసిపి హయాంలో అస్తవ్యస్తంగా..
గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పాలనలో పాఠశాల విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. వాటిని సరి చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి.. సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ అభిమతంగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు సంబంధించి అడ్మిషన్ల డ్రైవ్ కొనసాగుతోంది. అంగన్వాడీలో చదువుకుంటున్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, ఇతరత్రా వసతుల గురించి వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతుంది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
* వరుస నోటిఫికేషన్లతో..
అయితే ఒకవైపు డీఎస్సీ( DSC ) ప్రక్రియ జరుగుతుండగా మరోవైపు.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీ ఖరారు అయింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలనుంచి ఒంటిగంట వరకు పరీక్షలు ఉంటాయి. నాలుగు జిల్లా కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్సైట్లో పొందవచ్చు. వివిధ శాఖల్లో 81 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి అయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన సందడి కనిపిస్తోంది.
Also Read : ఏపీ డీఎస్సీ కి ఎలా అప్లయ్ చేయాలంటే.. లోకేష్ వీడియో ట్విట్!