AP Mega DSC 2025 : ఏపీలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు( AP DSC) సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మే 15 వరకు ఇది కొనసాగనుంది. డీఎస్సీ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మంత్రి నారా లోకేష్ డెమో వీడియో విడుదల చేశారు. అయితే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గత ఏడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ సమయంలో ఫీజు చెల్లిస్తే ఇప్పుడు మళ్లీ చెల్లించాల్సి ఉంటుందా? అన్నది అభ్యర్థుల్లో ఒక రకమైన అనుమానం ఉంది. దీనిని నివృత్తి చేస్తూ ఏపీ ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది.
Also Read : AP DSC : ఏపీ డీఎస్సీ కి ఎలా అప్లయ్ చేయాలంటే.. లోకేష్ వీడియో ట్విట్!
* మూడు విభాగాల్లో ప్రక్రియ..
మూడు విభాగాల్లో ఈ డీఎస్సీ నియామక ప్రక్రియ జరగనుంది. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం( personal information), రెండో విభాగంలో విద్యార్హతలు, మూడో విభాగంలో ఫీజు చెల్లింపు వివరాలు ఉంటాయి. అయితే మొదటి రెండు విభాగాలకు సంబంధించి సరి చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే సబ్మిట్ ఆప్షన్ నొక్కాలి. మూడు విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన, ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు.. రూ.750 చొప్పున ఫీజు చెల్లించాలి. అయితే అన్నింటికంటే మూడో విభాగంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వివరాలను సమగ్రంగా పొందుపరచాలి. ఎందుకంటే అక్కడ ఎటువంటి సవరణలకు అవకాశం లేదు. అందుకే వివరాలు నమోదు చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
* వారికి మినహాయింపు..
అయితే చాలామందిలో ఒక చిక్కుముడి ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం( YSR Congress government) 6100 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ సమయంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఫీజు కూడా చెల్లించారు. అప్పట్లో ఫీజు చెల్లించిన వారు.. ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో స్పష్టతనిచ్చింది విద్యాశాఖ. అయితే కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో అభ్యర్థి దరఖాస్తు చేసిన సమయంలో పెట్టిన పోస్టుల కంటే.. ఇప్పుడు ఆదరణంగా పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే మాత్రం రూ.750 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
* టెట్ లో నిర్ణీత మార్కులు
ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ లో( Teacher Eligible tests ) నిర్ణీత మార్కులు సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అనుమతించింది ప్రభుత్వం. ఓసి అభ్యర్థులు అయితే 90 మార్కులతో 60 శాతం తెచ్చుకున్న వారే అర్హులు. బీసీలకు సంబంధించి 75 మార్కులతో 50 శాతం తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 60 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి తన విద్యార్హతను బట్టి.. ఏ ఏ పోస్టులకు అర్హులవుతారు అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒక్కసారి ఎంపిక చేసుకున్నాక మార్చుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంపిక చేసుకున్న మొదటి పోస్ట్ ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్ కు ఎంపిక కాకపోతే.. అతడి పేరు రెండో ఆప్షన్ కు బదిలీ అవుతుంది. అదీ కాకుంటే మూడో ఆప్షన్ కు బదిలీ అవుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్ కు ఎంపికైతే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి. మరోవైపు 2024 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ.. 44 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరాదు. ఇక రిజర్వుడు కేటగిరి అభ్యర్థులకు మాత్రం గరిష్ట వయస్సు 49 ఏళ్లు. దివ్యాంగులకు గరిష్ట వయస్సు 54 ఏళ్లుగా నిర్ధారించారు. మాజీ సైనికులకు మాత్రం నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మూడు శాతం స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మెగా డీఎస్సీలో అత్యధికంగా 2678 పోస్టులు కర్నూలు జిల్లాకు ఉన్నాయి. అత్యల్పంగా మాత్రం 543 పోస్టులతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది.