Tirupati Laddos Row : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో.. హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ రావాలని పవన్ బలంగా కోరుకున్నారు. తన ఆకాంక్షను సైతం బయట పెట్టారు.ఈ క్రమంలో శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసిన ఈ ఘటనను నిరసిస్తూ.. ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించారు. 11 రోజులు పాటు ఈ దీక్షలో పాల్గొనున్నారు.చివరి రోజు దీక్షను విరమింప చేసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఈరోజు ఇంద్రకీలాద్రి లోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు స్వాగతం పలికాయి. పవన్ ఇంద్రకీలాద్రి మెట్లను శుభ్రం చేసి.. పసుపు, బొట్లు పెట్టారు. తనదైన రీతిలో పూజ చేస్తూ నిరసన తెలిపారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
* పవన్ స్ట్రాంగ్ రియాక్షన్
తిరుపతి లడ్డు వివాదం పై పవన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలా వైసిపి ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో టిటిడి విషయంలో వైఫల్యాలను బయటపెట్టినా.. ఎన్నడు నాడు సీఎం జగన్ స్పందించలేదన్నారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని పవన్ ఆరోపించారు. పదివేల రూపాయలు వసూలు చేసి.. 500 రూపాయలకు రశీదు రాశారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో నని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది కేవలం వైసీపీ వైఫల్యం గా అభివర్ణించారు. అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు.
* హిందూ మతం పై ప్రభావం
వైసిపి ఐదేళ్ల పాలనలో హిందూ మతం పై ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు పవన్. హిందూ సనాతన ధర్మం పరిరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ వివాదం జరిగిన వెంటనే ట్విట్ చేశారు. దీనిపై హిందూ సమాజం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఎక్కువమంది ఆహ్వానించారు కూడా. అటు తరువాత ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం విశేషం. 11 రోజులు పాటు ఈ దీక్షలో కొనసాగుతున్న పవన్.. టిటిడి లడ్డు వివాదం నేపథ్యంలో వినూత్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించారు.
* వివాదం ముదిరే అవకాశం
లడ్డు వివాదం పై కేంద్రం సీరియస్ గా ఉంది. హిందూ ధార్మిక సంఘాల సైతం ఆగ్రహంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో ప్రాయశ్చిత్త దీక్షకు దిగడం జాతీయ స్థాయిలో సైతం ఆకట్టుకుంటుంది. కేంద్రం సైతం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో.. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. రాజకీయంగా వైసీపీకి డామేజ్ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ చర్యలతో వైసిపి బెంబేలెత్తిపోతోంది.