Sakshi Media : సాక్షి పత్రిక ఎవరిదంటే.. ఎవరైనా చెప్పేస్తారు మాజీ సీఎం జగన్ ది అని. ఆ పత్రిక పై రాజశేఖర్ రెడ్డి బొమ్మతో ప్రజలను మరింత దగ్గర చేయాలని భావించారు. ప్రజలకు దగ్గర అయిందో లేదో కానీ.. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఉద్యమమే చేసింది సాక్షి. గత ఐదేళ్లుగా అడ్డగోలు దోపిడీకి సైతం సాక్షిని వాడుకున్నారు. ఏ పత్రికకు ఇవ్వనంత ప్రకటనలు.. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు బలవంతంగా సాక్షిని అంటగట్టి సర్క్యులేషన్ పెంచుకోవడం.. సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు చెల్లించేలా పదవులు ఇవ్వడం… ఇలా ఒకటేమిటి సాక్షి ద్వారా ఎన్నెన్నో రాచ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అయితే ఇప్పుడు అధికారం దూరమైంది. సాక్షికి అడ్డగోలుగా కేటాయింపులు బయటపడుతున్నాయి. దీంతో ఆత్మరక్షణలో పడుతున్నారు. సాక్షితో జగన్ కు సంబంధం లేదని చెబుతున్నారు. సాక్షి వ్యవహారాలను చూస్తే భారతీ రెడ్డికి సైతం సంబంధం తేల్చేస్తున్నారు. సాక్షికి ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం తనకే పాపం తెలియదని భ్రమింప చేస్తున్నారు.
* సాక్షి ఏర్పాటు చరిత్ర
ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో తెరపైకి వచ్చింది సాక్షి పత్రిక. రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. టిడిపి అనుకూల మీడియా గా ముద్రపడిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి మరి ప్రభుత్వానికి, రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా కథనాలు రాశాయి. ఉక్కిరి బిక్కిరి చేశాయి. అప్పటికే పారిశ్రామికవేత్తగా ఉన్న జగన్.. కడప జిల్లాలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడిగా, ఎంపీగా, పారిశ్రామికవేత్తగా ఉన్న జగన్ మీడియా రంగంలోకి అడుగు పెట్టారు. ఇందిరా పేరుతో సాక్షి పేపర్ తో పాటు చానల్ ను ఏర్పాటు చేశారు.
* జగన్ కు అండగా మీడియా
రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ నేతలు జగన్ కు ఎంతగా అండగా నిలబడ్డారో.. సాక్షి అంతకుమించి వెన్నుదన్నుగా నిలిచింది. వైసీపీ ఏర్పాటు తరువాత క్రియాశీలకంగా పని చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే అనుబంధ సంస్థగా మారింది. 2014 లో వైసీపీ ప్రతిపక్షంలో కూర్చున్నా.. సాక్షి మాత్రం రెచ్చిపోయి కథనాలు రాసింది. 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యింది. ఒకవైపు ఐప్యాక్, మరోవైపు వైసీపీ సోషల్ మీడియా, ఇంకో వైపు సాక్షి మీడియా బరితెగించి వ్యవహరించాయి. జగన్ కు అధికారానికి దగ్గర చేశాయి.
* ఆ విచారణకు భయపడి
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సాక్షికి అడ్డగోలు కేటాయింపులపై విచారణకు నిర్ణయించింది. దీంతో సాక్షితో మాకు సంబంధాలు లేవని చెప్పేందుకు జగన్, ఆయన సతీమణి భారతి, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు న్యాయస్థానాల్లో సైతం తమకు సంబంధం లేదని వాదిస్తున్నారు. అయితే సాక్షి అంటే వైయస్సార్ కుటుంబం.. వైయస్సార్ కుటుంబం అంటే సాక్షి అనే విధంగా బంధం పెనవేసుకుంది. అయితే సాక్షితో తమకు సంబంధం లేదని వారు వాదిస్తుండడం వైసీపీ శ్రేణులకు సైతం విస్మయ పరుస్తోంది. ఆ ప్రచారాన్ని వారు నమ్మడం లేదు.