Jawahar Reddy: గత కొద్దిరోజులుగా ఏపీలో ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. కొన్నివారాల నుంచి కొరడా ఝళిపిస్తోంది. ఎన్నికల సమయంలో పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులకు బదిలీ చేస్తోంది. ఇప్పటికే చాలామంది బదిలీ అయ్యారు. ఇందులో కొందరు ఎన్నికల నిబంధనల మేరకు బదిలీ కాగా.. మరికొందరు మాత్రం విపక్షాల ఫిర్యాదులతో చర్యలకు గురయ్యారు. అయితే ఇలా బదిలీ వేటు పడిన వారంతా ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిన వారే. అయితే అన్నింటికీ మించి విపక్షాలపై కేసులతో పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపిందన్న విమర్శ ఉంది. దీని వెనుక డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారన్నది ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ. ఇప్పుడు ఆయన పైనే వేటు పడింది.
ఇక అధికారులపై చర్యలు ఉండవని అంతా భావించారు. ఏపీలో వైసీపీకి కేంద్రం ఫేవర్ చేస్తుందన్న ఆరోపణ కూడా వచ్చింది. ఇటువంటి తరుణంలో రాత్రికి రాత్రే కొత్త డిజిపి నియామకం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లు సిఫారసు చేయగా.. 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పేరును ఎలక్షన్ కమిషన్ డిజిపిగా ఖరారు చేసింది.వాస్తవానికి సీనియర్ అధికారుల జాబితాలో ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల పేరు ఉంది. ఈయన సైతం వైసీపీ అస్మదీయ అధికారి అన్న పేరు ఉంది. అందుకే ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. చివరకు హరీష్ కుమార్ గుప్తా పేరును ఖరారు చేయడంతో.. వైసిపి ఒక్కసారిగా నీరు గారి పోయింది. అదే సమయంలో సీఎం జగన్ స్వరం సైతం మారింది.
అటు రాయలసీమలో కీలకమైన అనంతపురం డిఐజి అమ్మిరెడ్డి పై కూడా ఎన్నికల సంఘం వేటువేసింది. గత కొద్ది రోజుల నుంచి ప్రతిపక్షాలు ఆయనపై ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ఈ తరుణంలోనే ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలకు దిగింది. బదిలీ వేటు వేసింది. అయితే ఎన్నికలకు రెండు వారాల ముందు ఈసీ అధికారులపై చర్యలకు దిగడం విశేషం. దాదాపు వివాదాస్పద అధికారులంతా బదిలీ అయ్యారు. ఒకే ఒక్కరు మిగిలిపోయారు. ఆయనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. ఆయనపై చర్యలు ఉండబోతున్నాయి అన్నది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై చర్యలకు ఉపక్రమించడంతో.. ఇక మిగిలింది సి ఎస్ అని టాక్ నడుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయనపై సైతం చర్యలకు దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో ఎన్డీఏ కూటమి మాట నెగ్గినట్టే.