https://oktelugu.com/

MI Vs SRH: సూర్య ప్రతాపం మొదలైతే గాని.. ముంబైకి ఓదార్పు దక్కలేదు

ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 రన్స్ చేసింది. హెడ్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. అతడు 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 17 బంతుల్లో 35* రన్స్ చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 7, 2024 9:47 am
    MI Vs SRH

    MI Vs SRH

    Follow us on

    MI Vs SRH: ఐదుసార్లు ఛాంపియన్.. బలమైన బ్యాటింగ్ లైనప్.. అద్భుతమైన బౌలింగ్ దళం.. ఇవన్నీ ఉన్నప్పటికీ.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా సాగింది ముంబై జట్టు ఐపిఎల్ 17వ సీజన్ ప్రయాణం. దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తూ నిన్నటి వరకు పాయింట్ల పట్టికలో పదవ స్థానంలో కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆటగాళ్ల ఆట తీరుపై విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. వరుస ఓటములు.. క్రీడా విశ్లేషకుల విమర్శలు.. ఇవన్నీ ఆ జట్టు ఆటగాళ్ల పై తీవ్రంగా ప్రభావం చూపించాయనుకుంటా.. అందుకే సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై విజయాన్ని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు ధాటిగా ఆడారు అనేకంటే.. సూర్య కుమార్ యాదవ్ గెలిపించాడని చెప్పడం సబబు.

    ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 రన్స్ చేసింది. హెడ్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. అతడు 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 17 బంతుల్లో 35* రన్స్ చేశాడు. వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలా ఒక వికెట్ తీశారు.

    174 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై జట్టు 17.2 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 174 రన్స్ చేసింది. ముంబై ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 102* రన్స్ చేశాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్ వల్ల ముంబై జట్టు 16 బంతులు ఇంకా మిగిలి ఉండగానే.. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్ (9), రోహిత్ శర్మ (4) మరోసారి విఫలమయ్యారు. వన్ డౌన్ గా వచ్చిన నమన్ దీర్ (0) కూడా గోల్డెన్ డక్ గా వెను తిరిగాడు. దీంతో ముంబై జట్టు 5 ఓవర్లకు 36 పరుగులు మాత్రమే చేసి కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చాడు. కీలకమైన మూడు వికెట్లు పోయినప్పటికీ అతడు ఎదురుదాడినే ఎంచుకున్నాడు. తిలక్ వర్మతో అతడు ఏకంగా నాలుగో వికెట్ కు అజేయంగా 143 రన్స్ చేశాడు. ఈ దశలో అతని కూడా సెంచరీ సాధించాడు.

    ఈ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ తన బ్యాటింగ్ పరాక్రమాన్ని ప్రదర్శించాడు. 30 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. మరో ఆటగాడు తిలక్ వర్మ కూడా ధాటిగానే ఆడాడు. 50 పరుగులు పూర్తి చేసిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ మరింత దూకుడుగా ఆడాడు. స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్లో వరుసగా 4, 4, 6 కొట్టి తన బ్యాటింగ్ స్టామినా ఏమిటో సూర్య కుమార్ యాదవ్ నిరూపించాడు. నటరాజన్ వేసిన 18 ఓవర్లో సిక్స్ కొట్టి, 51 బంతుల్లో సెంచరీ సాధించాడు. ముంబై జట్టు విజయ లాంచనాన్ని కూడా పూర్తి చేశాడు

    ఈ మ్యాచ్లో ప్రారంభ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత లయ తప్పింది. దీంతో ముంబై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ ఓటమితో హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలను కఠిన తరం చేసుకుంది. ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లాలంటే మిగతా మూడు మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి.