CM Jagan Yagam : స్వామి స్వరూపానంద లేకుండానే జగన్ రాజశ్యామల యాగం.. ఏమవుతుందో ఏమో?

గత ఎన్నికలకు ముందు విశాఖలోని శారదాపీఠంలో ఈ యాగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం జగన్ ఇంట్లో నిర్వహించడం గమనార్హం. మరోవైపు స్వరూపానంద స్వామి కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

Written By: NARESH, Updated On : May 16, 2024 4:04 pm

CM Jagan Yagam

Follow us on

CM Jagan Yagam : సీఎం జగన్ నివాసంలో రాజ్యశ్యామల యాగం నిర్వహించారు. ఏకంగా 41 రోజులపాటు ఈ యాగం నిర్వహించడం విశేషం. గత 40 రోజులుగా ఈ యాగం కొనసాగుతున్నా.. బయటకు పొక్కకపోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటికి సంబంధించి ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. బుధవారం చివరి రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఒక్కరే పాల్గొనడం విశేషం. ఆయన పక్కన సతీమణి భారతి కనిపించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

రాజశ్యామల యాగం అంటే ముందుగా గుర్తుకొచ్చేది విశాఖ శారదా పీఠం. పీఠాధిపతి స్వామి స్వరూపానంద ఉభయ రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా రాజశ్యామల యాగాలు జరిపించారు. ముందుగా కెసిఆర్ రాజశ్యామల యాగం జరిపించుకున్నారు. మొదటిసారి అధికారంలోకి రాగలిగారు. 2019 ఎన్నికలకు ముందు కెసిఆర్ సలహాతో జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు. స్వామి స్వరూపానంద పర్యవేక్షణలో జరిపించారు. ఆ ఎన్నికల్లో గెలుపొందారు. గత ఐదు సంవత్సరాలుగా శారదాపీఠంలో జరిగే వార్షికోత్సవ వేడుకలకు జగన్ హాజరయ్యేవారు. క్రమం తప్పకుండా రాజశ్యామల యాగం జరిపించేవారు. అయితే ఈ ఎన్నికల ముందు స్వరూపానంద వాయిస్ ఎక్కడా వినిపించలేదు. కానీ తాడేపల్లిలోని తన నివాసంలో గత 40 రోజులుగా ఈ యాగం కొనసాగుతూ ఉండడం విశేషం.

శారదా పీఠం నుంచి వచ్చిన వారు ఎవరు కనిపించలేదు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరాం ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో గత 40 రోజులుగా యాగం కొనసాగినట్లు తెలుస్తోంది. జగన్ నివాసంలోని ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో కృతువు కొనసాగింది. మొత్తం 45 మంది పండితులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మరోసారి అధికారం దక్కించుకునే ఉద్దేశంతోనే ఈ రాజశ్యామల యాగం నిర్వహించినట్లు సమాచారం. గత ఎన్నికలకు ముందు విశాఖలోని శారదాపీఠంలో ఈ యాగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం జగన్ ఇంట్లో నిర్వహించడం గమనార్హం. మరోవైపు స్వరూపానంద స్వామి కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది.