AP Cabinet Meeting: బాబు ముందరి కాళ్లక బంధం.. ఏపీ కేబినెట్‌ భేటీ.. వలంటీర్లు, బీసీ రిజర్వేషన్లపై ఏం చేస్తారో?

ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్‌ సమావేశం బుధవారం(సెప్టెంబర్‌ 18న) ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఎక్సైజ్‌ పాలసీ, బీసీ రిజర్వేషన్లు, వలంటీర్ల కొనసాగింపుపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Written By: Raj Shekar, Updated On : September 18, 2024 2:33 pm

AP Cabinet Meeting

Follow us on

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం బుధవారం(సెప్టెంబర్‌ 18) జరుగనుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద తెలిపే అవకాశం ఉంది. ఇటీవల ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. దీనిపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. ఇక ఏపీలో కొత్త ఎక్సైజ్‌ పాలసీపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపైనా చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త పాలసీ అమలులోకి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కూడా కేబినెట్‌ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. వలంటీర్‌ వ్యవస్థ కొనసాగింపు, మైనింగ్‌ పాలసీపైనా కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు..
ఏపీలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఏపీలో బీసీ గణన చేశారు. ఈ నేపథ్యంలో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. దీంతో బీసీ రిజర్వేషన్లను 38 శాతానికి పెంచే అంశంపై కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపే అవకాశం ఉంది. ఇక 2014 –19 మధ్య అమలు చేసిన ఎన్టీఆర్‌ విదేశీ విద్య, విద్యోన్నతి పథకాలను పునరుద్ధరించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. దీనిపైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 20తో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో కేబినెలో ఈ అంశం కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. శాఖల వారీగా మంత్రుల ప్రోగ్రెస్‌ కార్డులను చంద్రబాబు అందిస్తారని తెలుస్తోంది.

వాలంటీర్లపై కీలక నిర్ణయం..
ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనసాగించడం లేదు. ప్రస్తుతం వలంటీర్లు ఖాళీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి కొనసాగింపుపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మూడు నెలలుగా వలంటీర్లు వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తమను కొనసాగిస్తారా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. అయితే కొంతమందిని కొనసాగించాలనే ఆలోచనలో ఏపీ సర్కార్‌ ఉన్నట్లు సమాచారం. కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.