AP Assembly : ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయానికి కారణం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ పార్టీకి చాలా నష్టం చేసింది ఈ చట్టం. విపక్షాల ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్నారు జగన్. కానీ ఆ ప్రచారమే కొంపముంచింది. అదే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైసిపి ఘోర ఓటమికి కారణమైంది. అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను టిడిపి కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దానిని బుట్ట దాఖలు చేసింది. చట్టాన్ని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో 2021-22 మధ్య అప్పటి జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయిపోయింది.
* ఆ అధికారి తీరుతోనే
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేసింది జగన్ సర్కార్.వాస్తవానికి ఈ యాక్ట్ ను తయారు చేసింది గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి.ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న ఆ అధికారిని తెప్పించుకున్నారు జగన్. విప్లవాత్మక మార్పులు చేస్తారని ఆశించారు.దీంతో వెంకటరెడ్డి కే పూర్తి బాధ్యతలు అప్పగించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో నుంచి సర్వే రాళ్లపై ఆయన చిత్రం వరకు రూపకల్పన అంతా వెంకటరెడ్డిదే. కేవలం సర్వే రాళ్లలో వందల కోట్లు వెనకేసుకోవాలని వెంకటరెడ్డి చూసినట్లు ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.కానీ జగన్ ఇవేవీ పట్టించుకోలేదు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో మొండిగా ముందుకు వెళ్లారు.మూల్యం చెల్లించుకున్నారు.
* ఎన్నికల్లో విశేష ప్రభావం
ఎన్నికలకు మూడు వారాల ముందు అనూహ్యంగా ఈ అంశం తెర మీదకు వచ్చింది. అప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే.. ఈ చట్టం వ్యవహారం తెరమీదకు వచ్చిన తరువాత జరిగిన ప్రచారం మరో ఎత్తు. అప్పటివరకు గెలుపు దీమాతో ఉన్న వైసీపీ నాయకులకు ఈ చట్టంపై ప్రతిపక్షాలు చేసిన ప్రచారం మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఈ చట్టం అమలు చేస్తే మీ భూములు మీవి కావు. జగన్ వాటిని లాగేసుకుంటాడు. మీ ఆస్తులు తీసేసుకుంటాడు అంటూ చంద్రబాబుతో పాటు పవన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వారిలో ఆలోచన తెచ్చింది. అధికార వైసీపీకి వ్యతిరేకంగా మార్చింది. కూటమి అంతులేని మెజారిటీ సాధించడానికి కారణమైంది.
* శాసనసభ ఆమోదం
అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాస్పదమైన ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్య ఫైళ్ళల్లో భాగంగా సంతకం చేశారు. ఈరోజు శాసనసభ ప్రారంభం కాగానే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో పెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు అంగీకరించేవారు అవును అనాలని సూచించారు. దీంతో అందరూ ఏకగ్రీవంగా అవును అని చెప్పారు. దీంతో చట్టం రద్దు ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.కాగా ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సభలో లేరు.