AP Assembly Election Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితం ఏకపక్షంగా వచ్చింది. వార్ వన్ సైడ్ అన్నట్టు టిడిపి కూటమి మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంది. కానీ కౌంటింగ్ కు ముందు మాత్రం ఉత్కంఠ భరిత వాతావరణం సాగింది. సర్వే సంస్థలు ఒకవైపు, జ్యోతిష్యాలు మరోవైపు, విశ్లేషణలు ఇంకోవైపు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఏపీ ప్రజలను కన్ఫ్యూజన్లో పడేశాయి. ముఖ్యంగా జ్యోతిష్యులు హల్చల్ చేశారు. ఫలానా నేత గెలుస్తాడని గంటాపధంగా చెప్పుకొచ్చారు. కానీ మెజారిటీ జ్యోతిష్యాలు ఫెయిల్ అయ్యాయి. జ్యోతిష్యం చెప్పినవారు క్షమాపణలు కోరే వరకు పరిస్థితి వచ్చింది.
జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. మనిషి పుట్టుకలను, జన్మ నక్షత్రాలను బట్టి జ్యోతిష్యం చెబుతుంటారు. అయితే ఇటీవల అది రాజకీయపరంగా మారింది. చివరకు క్రీడల్లో ఎవరు గెలుస్తారో కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. అక్కడ క్రీడాకారుల నైపుణ్యం కంటే.. ఆ టీం యజమాని స్థితిగతులను అంచనా వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రాచీన జ్యోతిష్యానికి భారతదేశం పెట్టింది పేరు. ఒక జ్యోతిష్యుడు జోష్యం చెప్పాడంటే వాస్తవానికి దగ్గరగా ఉండేది. కానీ ఇప్పుడు జోష్యం రాజకీయ పార్టీలకు అనుగుణంగా మారిపోయింది. ఫలానా వ్యక్తి, ఫలానా నేత, ఫలానా క్రీడా జట్టు తప్పకుండా గెలుస్తుందని వొక్కి నొక్కానించి చెప్పడం నిజంగా దురదృష్టకరం.
జ్యోతిష్యానికి సంబంధించి తిధి నక్షత్రాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. సంబంధిత మనిషిని ఎదురుగా పెట్టుకుని జ్యోతిష్యం చెప్పడం ఆనవాయితీ. కానీ గత రెండు సంవత్సరాలుగా వేణు స్వామి జగన్ గెలుస్తారు.. మరో 17 సంవత్సరాల పాటు ఆయనే సీఎం గా ఉంటారు అంటూ జ్యోతిష్యం చెప్పారు. గతంలో ఇదే జ్యోతిష్యుడు తెలంగాణ ఎన్నికల్లో చెప్పిన జోష్యం ఫలించలేదు. ఇప్పుడు కూడా ఒక వ్యూహం ప్రకారం జోష్యం చెప్పినట్లు కనిపిస్తోంది. అందుకే ఫలితాలుపూర్తయిన తర్వాత నన్ను క్షమించండి అంటూ వీడియో విడుదల చేశారు. ఇక జ్యోతిష్యం చెప్పనని కూడా చెప్పుకొచ్చారు.ఉగాది పంచాంగ శ్రవణం కూడా రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక పార్టీ ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో పాల్గొనే అర్చకుడుఆ పార్టీయే గెలుస్తుందని చెప్పుకొస్తున్నాడు. ఎవరికి వారే ఇలా చెబుతుండడంతో జ్యోతిష్య శాస్త్రం పై ప్రజల్లో ఒక రకమైన అపనమ్మకం కలుగుతోంది. దానిని కాపాడుకోవాల్సిన అవసరం జోష్యం చెప్పే వారికి ఉంది.