Tulasi Babu: గుడివాడలో( Gudivada) తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొడాలి నానిని ఓడించినా.. తాము అనుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయినా.. వారిలో ఆ బాధ పోలేదు. తమ దృష్టిలో దుర్మార్గుడుగా భావించే కొడాలి నాని వెళ్లిపోయినా .. అంతకుమించి అన్నట్టు మరో నేత తమను ఇబ్బంది పెడుతున్నాడు. సొంత పార్టీ మాటున దందాలకు దిగుతున్నాడు. అలాగని ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వెనిగండ్ల రాము కాదు. ఆయన ప్రధాన అనుచరుడు తులసి బాబు. షాడో ఎమ్మెల్యేగా పేట్రేగిపోతున్నాడు. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన తులసి బాబు.. అప్పటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుని( raghuramakrishna Raju ) చిత్రహింసలు పెట్టగలిగాడు. ఆ కేసులో నిందితుడు కూడా. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కు నమ్మిన బంటు. అయితే వైసీపీలో ఎలా వెలుగు వెలిగారో.. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వంలో సైతం అదే హవాను కొనసాగిస్తున్నారు. అదే తులసి బాబు స్పెషల్. అయితే ఈ పరిస్థితిని తలచుకొని గుడివాడ టిడిపి శ్రేణులు మాత్రం తెగ ఆవేదనతో గడుపుతున్నాయి.
* ఆ ఆనందం లేకుండా
మొన్నటి ఎన్నికల్లో గుడివాడలో వైసీపీ అభ్యర్థి గుడివాడ నాని పై వెనిగండ్ల రాము( vinigandla Ramu ) ఎమ్మెల్యేగా గెలిచారు. ఏకంగా 50 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ భారీ ఓటమీతో కొడాలి నాని అడ్రస్ లేకుండా పోయింది. దీంతో గుడివాడ ప్రశాంతంగా ఉంటుందని భావించారు అక్కడి ప్రజలు. కానీ షాడో ఎమ్మెల్యే తెరపైకి వచ్చారు. ఆయనే తులసి బాబు( Tulsi Babu) . ఒంగోలు నుంచి తీసుకొచ్చిన బ్యాచ్ తో దందాలు, సెటిల్మెంట్లు చేసేవారు. అయితే ఇప్పుడు స్థానికంగా ఉన్న యువతను గ్యాంగ్ లో చేర్చుకుని అక్రమ వసూళ్లు, దాడులు, బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
* ఎంపీ రఘురామకృష్ణంరాజుకు టార్చర్
ఒకప్పుడు సిఐడి చీఫ్ గా వ్యవహరించారు సునీల్ కుమార్. వైసిపి హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును గుంటూరు తీసుకొచ్చి మరి చిత్రహింసలు పెట్టారు. ఇంటరాగేషన్ పేరుతో ప్రైవేటు వ్యక్తిగా ఉన్న తులసి బాబును రప్పించి మరి రఘురామకృష్ణం రాజు పై ప్రయోగించారన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై స్వయంగా రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఇటీవల తులసి బాబు అరెస్ట్ కూడా జరిగింది. విచారణ పేరిట సిఐడి స్టేషన్కు తీసుకొచ్చిన రఘురామకృష్ణంరాజు గుండెలపై తులసి బాబును అప్పట్లో కూర్చోబెట్టారని బాధితుడు రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు. అప్పట్లో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఇంట్లోనే ఎక్కువగా గడిపేవారు తులసి బాబు. ఆయన తరుపున ప్రైవేటు వ్యవహారాలు, దందాలు అన్ని తులసి చక్కబెట్టే వారట. అప్పట్లో దిశ పేరిట కేటాయించిన నిధుల దుర్వినియోగం, సిఐడిలో బదిలీలు, పనిష్మెంట్లు ఎత్తివేయించడం, కీలకమైన కేసులు సెటిల్మెంట్లు చూడడం అంతా తులసి బాబు చూసేవారన్నది పోలీస్ వర్గాల నుంచి వినిపించే మాట.
* సరిగ్గా ఎన్నికలకు ముందు ఎంట్రీ
సరిగ్గా ఎన్నికలకు ముందు గుడివాడ( Gudivada ) టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము వద్దకు చేరారు తులసి బాబు. ఆయన విజయానికి కృషి చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత గుడివాడలో కింగ్ మేకర్ గా మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కంటే.. గుడివాడలో తులసి బాబు హవా ఉంటుందట. నిత్యం గ్యాంగులతో తిరుగుతుంటాడట. ఎందుకుగాను రాజేంద్రనగర్ అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్లు కేటాయించాడట. బైపాస్ రోడ్డుకు సమీపంలో ఆఫీస్ తెరిచాడట. రేషన్ తో పాటు ఇసుక దందాలో ఆయనదే క్రియాశీలక పాత్ర ఆట. ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి పనులు చేయించుకోవడం ఈయన నైజం అట.
* ఎమ్మెల్యేను కలవాలంటే
అయితే గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రామును ఎవరైనా కలవాలంటే ముందుగా తులసి బాబు( Tulasi Babu ) దర్శనం చేసుకోవాల్సిందే. అతడు చెప్పాడు అంటే ఏం పని అయినా క్షణాల్లో పూర్తి చేయాల్సిందేనట. బెదిరింపులు అరాచకాలతో ఆదాయం సమకూర్చే తులసి బాబుకు ఎమ్మెల్యే రాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అప్పటినుంచి ఆయన రెచ్చిపోతున్నారట. అయితే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయడం, పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయనను పరామర్శించేందుకు పదుల సంఖ్యల వాహనాలతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. టిడిపి శ్రేణులకు కూడా సీన్ అర్థమైంది. ఇప్పుడు తులసి బాబు వైసిపి మనిషి అని తెలియడం తో అంతా ఓపెన్ అవుతున్నారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించామన్న ఆనందం కూడా లేకుండా చేశారని తెగ బాధపడుతున్నారు.