AP Rains: ఏపీకి మరో హెచ్చరిక. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ ఒడిస్సా తో పాటు ఉత్తరాంధ్రకు ఆనించి ఇది కేంద్రీకృతమై ఉంది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి మోస్తరువర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తోంది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ,కాకినాడ,అల్లూరి,మన్యం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఒడిస్సా లో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఉత్తరకొస్తాలో నిన్న తేలికపాటి వానలు పడ్డాయి. రాబోయే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* తుఫాన్ల భయం
నవంబరు, డిసెంబర్లలో భారీ తుఫాన్లు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబరు నెలలు గరిష్ట సంఖ్యలో ఏర్పడే తుఫాన్లు పుదుచ్చేరి, తమిళనాడు మధ్య తీరాలు దాటుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా ఏపీకి భారీ వర్ష సూచన ఉండడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షాలు తీవ్రంగా పడితే అందుకు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.
* వేసవిని తలపించిన ఎండలు
మరోవైపు రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్తీక మాసం దగ్గర పడుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తోంది. అయినా సరే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రత అధికంగా ఉంది.