Chandrababu Jail: చంద్రబాబుకు మళ్లీ షాక్.. ఇంకెన్నాళ్లీ జైలు?

ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9న దానిపై విచారణ జరిగింది. కానీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోలేదు.

Written By: Dharma, Updated On : October 20, 2023 2:32 pm

Chandrababu

Follow us on

Chandrababu Jail: చంద్రబాబుకు ఊరట దక్కడం లేదు. అవినీతి కేసుల్లో న్యాయస్థానాల్లో ఉపశమనం లభించడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి 40 రోజులు దాటుతోంది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనపై అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు ఏసీబీ కోర్టుతో పాటు పిటిషన్లు దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 8 కి కేసు విచారణను వాయిదా వేస్తూ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తీర్పు చెప్పింది.

ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9న దానిపై విచారణ జరిగింది. కానీ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోలేదు. దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వర్గాల వాదనను విన్న సుప్రీం కోర్ట్ విచారణను నేటికి వాయిదా వేసింది. ఇక్కడ సానుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు తరుపు న్యాయవాదులు భావించారు. కానీ కోర్టు విచారణ వాయిదాకి మొగ్గు చూపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు పై ముందుగా తీర్పు వెల్లడిస్తామని.. ఆ తరువాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణలో తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని.. పిటి వారెంట్ పై యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది.

చంద్ర బాబు కేసులు ఇప్పట్లో తేలే అవకాశం కనిపించడం లేదు.ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసునకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ లో ఉంది. అయితే కోర్టు ఈరోజు తీర్పు చెబుతుందా? లేదా? అన్నది తెలియడం లేదు. ఇదో హై ప్రొఫైల్ కేసు కావడంతో లోతైన విచారణ జరగడంతో.. తీర్పు వెల్లడించే అంశంలో జాప్యం జరిగే పరిస్థితి ఉంది. ఈరోజు కానీ తీర్పు వెల్లడి కాకుంటే.. నవంబర్ మొదటి వారానికి కేసు విచారణ వాయిదా పడనుంది. ఇప్పటికే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఫై విచారణ వాయిదా పడింది. ముందుగా స్కిల్స్ స్కాం తీర్పు.. తరువాత ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పై విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేయడంతో.. చంద్రబాబు మరికొన్ని రోజులు పాటు జైలులో ఉండాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి.