https://oktelugu.com/

YCP MLC: వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై.. వైయస్సార్ వీర విధేయత నేత

రాజశేఖర్ రెడ్డిని అభిమానించే చాలామంది నేతలు జగన్ వెంట అడుగులు వేశారు. కానీ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 4, 2025 / 01:12 PM IST

    YCP MLC

    Follow us on

    YCP MLC: వైసీపీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి వరుస పెట్టి నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడడంతో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం బయటకు వస్తుండడం విశేషం. పెద్ద పెద్ద పదవులను సైతం రాజీనామా చేసి కూటమి పార్టీల వైపు చూస్తుండడం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, కృష్ణయ్యలు రాజీనామా చేశారు. వారి రాజీనామా ఆమోదం కూడా పొందాయి. రాజ్యసభ ఉప ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. టిడిపి తరఫున బీదా మస్తాన్ రావు, సానా సతీష్ రాజ్యసభ సభ్యులయ్యారు. కృష్ణయ్య బిజెపి తరఫున ఎంపికయ్యారు. మరోవైపు నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు సైతం వారి పదవులకు రాజీనామా చేశారు. అయితే మండలి చైర్మన్ గా వైసీపీకి చెందిన మోసేన్ రాజు ఉండడంతో వారి రాజీనామాకు ఆమోదం లభించడం లేదు. ఇటువంటి తరుణంలో పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా వైసీపీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మర్రి రాజశేఖర్ పదవికి గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది.

    * తొలినుంచి జగన్ వెంట అడుగులు
    వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు మరి రాజశేఖర్. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఆయన. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేశారు రాజశేఖర్. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో విడుదల రజిని కోసం తన సీటును త్యాగం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ తో పాటు మంత్రిగా అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో రజిని విజయం కోసం పోరాటం చేశారు రాజశేఖర్. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ రాజశేఖర్ త్యాగాన్ని మరిచిపోయారు. కానీ రజినీని ప్రమోట్ చేశారు. మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో చిలకలూరిపేట టిక్కెట్ ఆశించారు మర్రి రాజశేఖర్. కానీ ఆయనకు అవకాశం ఇవ్వకుండా గుంటూరు కార్పొరేషన్ మేయర్ కు అవకాశం ఇచ్చారు. విడుదల రజినిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. అక్కడ రజనీకి ఓటమి ఎదురయ్యేసరికి తిరిగి చిలకలూరిపేటకు పంపించారు. దీంతో మనస్థాపానికి గురైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    * రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయుడు
    మర్రి రాజశేఖర్ వైయస్సార్ కుటుంబానికి విధేయుడుగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయనకు ఓటమి ఎదురైంది. 2014లో దురదృష్టం పలకరించింది. 2019లో అత్యంత బలంగా ఉన్న ఆయనను తప్పించి రజనీకి ఛాన్స్ ఇచ్చారు జగన్. 2024లో సైతం వలసనేతకు అవకాశం ఇచ్చిన జగన్ రాజశేఖర్ కి ముందు చేయి చూపారు. అప్పటినుంచి మనస్థాపంతో ఉన్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పాలని తాజాగా నిర్ణయించుకున్నారు. ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.