Annadata Sukhibhava : ఏపీ ప్రభుత్వం( AP government) రైతులకు శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అర్హులైన రైతులందరికీ ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు స్పష్టత ఇచ్చింది. మొదటి విడతగా 7000 రూపాయలను అందించేందుకు సిద్ధపడుతోంది. ఏడాదికాలంగా ఈ అన్నదాత సుఖీభవ కోసం రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు దానిపై క్లారిటీ వచ్చింది. ఈనెల 20న తొలి విడతగా 7000 రూపాయలను అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పిఎం కిసాన్ ఈనెల 20న అందించనున్న నేపథ్యంలో.. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5000 రూపాయలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* 20న ఖాతాల్లో జమ..
అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bava) పథకం కింద ప్రతి రైతుకు 20వేల రూపాయలను సాగు సాయంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే ముహూర్తం పెట్టింది. కేంద్రం అందించే పీఎం కిసాన్ మూడు విడతలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14000 అందించేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 45.71 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఈనెల 20న రైతులకు పిఎం కిసాన్ కింద రూ.2000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5000.. మొత్తం రూ.7000 అందనుంది. అనివార్య కారణాలతో కేంద్రం తేదీని మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం సైతం మార్చే అవకాశం ఉంది.
Also Read: అన్నదాత సుఖీభవ.. అర్హతలివే.. మార్గదర్శకాలు జారీ!
* మిగతా రెండు విడతలు అప్పుడే..
సాధారణంగా అక్టోబర్లో రెండో విడతలో పిఎం కిసాన్( pm Kisan) నిధులు జమవుతాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరో ఐదు వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జనవరిలో అందించే మూడో విడత పీఎం కిసాన్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 4వేల రూపాయలు అందించనున్నారు. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, వ్యవసాయేతర అవసరాలకు భూమిని ఉపయోగిస్తున్న వారు.. అనర్హులు. ఆధార్ సీడింగ్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, నెలకు పదివేల కంటే అధికంగా పింఛన్లు పొందే వారిని గుర్తిస్తారు. రైతు సేవా కేంద్రాలు పరిశీలించి 79 లక్షల మంది అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తారని తేల్చారు. మొత్తానికైతే అన్నదాత సుఖీభవ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చిందన్నమాట.