Annadata Sukhi Bhava : ఏపీలో( Andhra Pradesh) మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం అయ్యింది. రైతులకు సాగు ప్రోత్సాహం కింద నగదు అందించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పేరిట ఉన్న పథకాన్ని అన్నదాత సుఖీభవ గా మార్చింది. ప్రతి రైతుకు రూ.20 వేలు అందించేందుకు నిర్ణయించింది. కౌలు రైతులకు సైతం ఈ పథకం వర్తించనుంది. అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ముందుగానే ఈ నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ 3 విడతలతో కలిపి.. మొత్తాన్ని అందించేందుకు నిర్ణయించింది.
Also Read : కొత్త కార్డుల జారీపై కీలక అప్డేట్.. జూన్ 30 వరకు గడువు!
* అన్నదాత సుఖీభవగా మారుస్తూ..
2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) రైతు భరోసా పథకానికి హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు ఏడాదికి 15000 రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.7500కు మాత్రమే పరిమితం అయ్యారు. కేంద్రం అందించే రూ.6000 మొత్తంతో రూ.13,500 అందించారు. అయితే తాము అధికారంలోకి వస్తే రైతులకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే వెబ్ సైట్ లో అన్నదాత సుఖీభవ పేరు మార్చారు. దీంతో వెంటనే పథకం అమలు అవుతుందని అంతా భావించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న తరుణంలో పథకం అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
* మూడు విడతల్లో మొత్తం..
పీఎం కిసాన్ ( pm Kisan) నిధి కింద ఏడాదికి ప్రతి రైతుకు 6000 రూపాయల మొత్తం సాగు ప్రోత్సాహం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఈ మొత్తాన్ని అందిస్తోంది. ఈ మొత్తం తోనే అన్నదాత సుఖీభవ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. తొలి రెండు విడతలు 5000 రూపాయల చొప్పున.. చివరి విడత రూ.4000 చొప్పున అందించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రం అందించే ఆరువేల రూపాయల మొత్తంతో రూ.14000 జత కలిపి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ భూములపై హక్కులు ఉన్నవారికి సైతం ఈ పథకం వర్తించనుంది. ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి.. అర్హుల జాబితాను తయారు చేస్తారు. ఈనెల 20 లోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలి. అదే సమయంలో వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
* వారికి వర్తించదు..
అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకాన్ని భార్య, భర్త, పిల్లలు ఒక కుటుంబం గా పరిగణిస్తారు. పెళ్లయిన పిల్లలను వేరే కుటుంబంగా చూస్తారు. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే అని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ,మేయర్, జడ్పీ చైర్మన్ వంటి పదవులు నిర్వహించిన వారికి, మాజీ లకు ఈ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసేవారు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పని చేసేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కాదు. నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునేవారు సైతం అనర్హులే. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ 4, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్ లు, అకౌంటెంట్లు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. అలాగే పన్ను చెల్లించిన వారికి సైతం ఈ పథకం పొందలేరు.