Annadata Sukhi Bhava: అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) సాయం పై కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం కోసం రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1.45 లక్షల మంది రైతులు ఈ కేవైసీలో భాగంగా వేలిముద్రలు వేసుకున్నారు. అయితే మిగిలిన రైతుల వివరాలు ప్రభుత్వ డేటాతో సరిపోవడంతో వారికి మినహాయింపు లభించింది. అర్హుల జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచునున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు తమ స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఈనెల 20న పీఎం కిసాన్ నిధులతో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో ఈ కేవైసీ వేలిముద్రల నుంచి మినహాయింపు లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రైతు సేవా కేంద్రాల వద్ద రద్దీ..
మొన్న ఆ మధ్యన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తప్పకుండా ఈకేవైసీ( ekyc ) చేయించుకోవాలని.. వేలిముద్రలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు సేవా కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. గత కొద్ది రోజులుగా రద్దీ నెలకొంది. కొంత గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైతులకు ఊరట నిచ్చేలా ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం దగ్గర వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఆ మేరకు ప్రభుత్వం జాబితాలను రైతు భరోసా కేంద్రాలకు పంపించింది.
Also Read: Annadata Sukhibhava Update: అన్నదాత సుఖీభవ’ బిగ్ అప్డేట్.. రైతుల ఖాతాలో రూ.7000!
20 వరకు గడువు
వాస్తవానికి రాష్ట్రంలో 45.65 లక్షల మంది అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా తేల్చింది ప్రభుత్వం. వీరంతా 20 తేదీలోగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించింది. ఈ పరిస్థితుల్లో రైతులు తమ పొలాల పాస్ పుస్తకాల డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులతో రైతు సేవా కేంద్రాలకు వెళ్లారు. అక్కడ సిబ్బంది కూడా ఉదయం నుంచి వీధుల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేయగలమో.. లేదోనని రైతులు ఆందోళన చెందారు. అయితే 44.19 లక్షల మంది రైతులకు సంబంధించి వివరాలు సరిపోయాయి. మిగిలిన 1.45 లక్షల మంది రైతులకు సంబంధించిన వివరాలు మాత్రం సరిపోలేదు. ఇప్పుడు వారు మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.
త్వరలో స్టేటస్ చెక్ ఆప్షన్..
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లబ్ధిదారుల కోసం చెక్ స్టేటస్ ( status check)అనే ఆప్షన్ ను అందుబాటులోకి తేవాలని చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఆధార్ నెంబర్ నమోదు చేయగానే అర్హులైన వారి వివరాలు అక్కడ కనిపిస్తాయి. రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలో.. అవసరం లేదు కూడా తెలుస్తుంది. త్వరలో ఈ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో స్టేటస్ చెక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.