Ankaravu ordinary advisor : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో సలహాదారులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. తమ పార్టీకి పనికొచ్చారని కొందరిని.. పనికొస్తారని మరికొందరిని.. సొంత సామాజిక వర్గం వారిని పెద్ద ఎత్తున సలహాదారులుగా అప్పట్లో నియమించారు. వారికి లక్షల్లో వేతనాలు, వాహన సదుపాయం, ఇతరత్రా రాయితీలు అందించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు సలహాదారుల నియామకంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరం మేరకు మాత్రమే సలహాదారులను నియమించుకుంటున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా తీసుకుంటున్నారు. తాజాగా అంకారావు అనే వ్యక్తిని సలహాదారుడుగా ఎంపిక చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయనను ఏకంగా సలహాదారుడుగా తీసుకుంటున్నట్లు అక్కడికక్కడే ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు సీఎం చంద్రబాబు. దీంతో అంకారావు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆయననే ఎందుకు సలహాదారుడిగా నియమించారు? అన్నది హాట్ టాపిక్ అయ్యింది.
* వన మహోత్సవంలో సన్మానం..
ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా ఇటీవల తుళ్లూరు మండలం అనంతవరంలో వనమహోత్సవం( Vana mahotsavam ) చేపట్టారు. ఏపీలో తిరుపతి జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డుంకూరు వరకు ఉన్న 997 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున వనాలు ఏర్పాటు చేయనున్నారు. అనంతవరంలో దీనికి సంబంధించిన వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారిని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ సన్మానం చేశారు. ఇలా సన్మాన గ్రహీతల్లో అంకారావు( Anka Rao ) ఒకరు. నల్లమల అడవులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారిలో అంకారావు కూడా ఉన్నారు. ఆయన పూర్తి పేరు కొమెర అంకారావు. పల్నాడు జిల్లా కారంపూడి కి చెందిన అంకారావుది వేద మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయ కూలీగా పని చేస్తూ దూరవిద్య ద్వారా పీజీ కూడా పూర్తి చేశారు. రోజు ఉదయం నల్లమల అడవుల్లోకి వెళ్లడం.. చెట్ల కింద పడి ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఏరి వేయడం, కాలుష్యపు కుంటల్లో దిగి ప్లాస్టిక్ చెత్తను తొలగించడం, పక్షులకు గింజలు వేయడం ఆయన దినచర్యలో భాగం.
* అభ్యుదయ భావాలతో..
ప్రాథమిక స్థాయి నుంచి అంకారావుది అభ్యుదయ భావం. తనకున్న తక్కువ పొలంలో రాగులు, సజ్జలు పండించి వాటిలో సగం పక్షుల కోసమే వదిలేస్తారు. పక్షులు లేనిదే అడవి లేదనే భావన ఆయనది. పర్యావరణం పై స్థానికంగా ఉన్న పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు అంకారావు. అడవిలో దొరికే వనమూలికలను సేకరించి అవసరమైన వారికి ఇస్తారు. ప్రకృతి గొప్పతనం పై పలు పుస్తకాలు కూడా రాశారు. విలేజ్ లైఫ్ జర్నీ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న అంకారావును గుర్తించి సన్మానించింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అక్కడికక్కడే ఆయనను సలహాదారుడిగా నియమించారు. తాజాగా ఆ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
* గతానికి భిన్నంగా..
అయితే సలహాదారుల( advisor) నియామకం విషయంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరిస్తుండడంపై చాలామంది ఆహ్వానిస్తున్నారు. ఇది మంచి సంస్కృతి అని స్వాగతిస్తున్నారు. గతంలో సంబంధం లేని వ్యక్తులను ఆయా శాఖలకు సలహాదారులుగా నియమించారు. దాదాపు 100 మంది వరకు సలహాదారులను నియమిస్తూ అప్పట్లో వారికి భారీగా వేతనాలు ముట్ట చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వివిధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, సీనియర్లను సలహాదారులుగా నియామకం చేస్తున్నారు. అయితే పర్యావరణం పై స్పష్టమైన అవగాహన ఉన్న అంకారావు లాంటి సామాన్య వ్యక్తికి, ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేని సామాన్యుడికి సలహాదారుడుగా నియమించడంపై ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కె.అంకరావు గారు నియామకం ✅
అడవుల పెంపకం సలహాదారుగా అంకారావు నియామకం – రెండేళ్లు సలహాదారుగా కొనసాగనున్న అంకారావు గారు.
అంకారావును నియమిస్తూ సీఎస్ విజయానంద్ గారు ఉత్తర్వులు@APDeputyCMO @ncbn pic.twitter.com/lb6VeYgxSc
— Minister of panchayati and rural dovelopment (@PanchayatiandAp) June 10, 2025