AP Rain Alert:ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణం కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. రాయలసీమలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. చాలా వరకు జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఎండలు, ఆ తరువాత వానలు పడుతున్నాయి. ఎండలు ఉన్నచోట ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో రెండు మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే రుతుపవనాల కదలిక మొదలు కావడంతో.. వర్షాలు ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగానే ప్రవేశించిన రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడ్డాయి. మధ్యలో మందగించాయి. ఇప్పుడు మరోసారి విస్తరిస్తుండడంతో వర్షాలు ప్రారంభం అయ్యాయి.
* అక్కడక్కడా వర్షాలు ఉత్తరాంధ్రలోని( North Andhra) తీర ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతంలో వర్షం కొనసాగుతోంది. మరోవైపు ఈరోజు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది. 41 నుంచి 42.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
* రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
మరోవైపు శ్రీకాకుళం( Srikakulam ), అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే నరసాపురంలో 40.7, తునిలో 40.6, కావలిలో 40.5, బాపట్లలో 40, మచిలీపట్నంలో 39.8° ఉష్ణోగ్రత నమోదయింది. మరోవైపు ఈ నెల 12 నుంచి రుతుపవనాల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈరోజు రాయలసీమలో, బుధవారం నుంచి కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని కూడా భావిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉండడం విస్తు గొలుపుతోంది.