AP New Bar Policy: ఏపీలో( Andhra Pradesh) మందు బాబులకు గుడ్ న్యూస్. ఇకనుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. వైసిపి హయాం నుంచి కొనసాగుతూ వచ్చిన బార్ పాలసీని మార్చుతూ ఏపీ ప్రభుత్వం.. కొత్త పాలసీని ప్రకటించింది. ఈ బార్ పాలసీ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అంటే 2028 సెప్టెంబర్ వరకు అన్నమాట. కొత్త బార్ పాలసీ ప్రకారం ఇకపై అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచే అవకాశం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి బార్లు తెరవనున్నాయి. అయితే గతంలో రాత్రి 11 గంటలకు బార్లు మూసివేయాల్సి వచ్చేది. అయితే కొత్త విధానం ప్రకారం మరో గంట అదనంగా తెరిచే అవకాశం కల్పించారు. ఈరోజు నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది.
చాలా రాష్ట్రాల్లో అర్ధరాత్రి తర్వాత కూడా..
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బార్లు అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉంటాయి. ఏపీలో మాత్రం రాత్రి 11 గంటలకు బార్లు మూసివేయాల్సిందే. కొత్త బార్ పాలసీ( new bar policy ) అమల్లోకి రావడంతో అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లను నిర్వహించుకునేందుకు వీలు కల్పించారు. ముంబైలో అయితే రాత్రి ఒంటిగంట 30 నిమిషాల వరకు బార్లకు అనుమతి ఉంది. హైదరాబాదులో సైతం రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంది. బెంగళూరులో మాత్రం కాస్త భిన్నం. శుక్ర,శనివారాల్లో రాత్రి ఒంటిగంట వరకు.. మిగతా రోజుల్లో మాత్రం రాత్రి 11:30 గంటల వరకు బార్లకు అనుమతి ఉంది.
గీత కార్మికులకు 10 శాతం..
కొత్త పాలసీ ప్రకారం బార్లలో 99 రూపాయల క్వార్టర్ సీసా అమ్మరు. గీత కార్మికుల కోసం మొత్తం బార్లలో 10% రిజర్వ్ చేశారు. 840 బార్లలో 84 బార్లను గీత కార్మికులకు కేటాయించారు. బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆగస్టు 30 తో గడువు ముగియగా తక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టారు. మరోసారి దరఖాస్తుల గడువు పెంచే అవకాశం ఉంది. అయితే మారిన సమయం వేళలు, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకొని బార్లకు దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి బార్ కు విధిగా నాలుగు దరఖాస్తులు రావాలి. కానీ అంతకంటే తక్కువ రావడంతో.. లాటరీ తీస్తారా? లేదా దరఖాస్తుల కోసం మరికొంత సమయాన్ని పెంచుతారా? అన్నది చూడాలి.