AP Investment Ranking: నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ (ఐఎఫ్‌ఐ) రాష్ట్రాల పెట్టుబడి వాతావరణాన్ని మరింత విస్తృతంగా అంచనా వేసే కొత్త సాధనం. గతంలో కేంద్రం నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌తో పోలిస్తే ఇది 84 అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అనుమతుల వేగం, వ్యాపార వాతావరణం, ఆర్థిక ఆరోగ్యం వంటి అంశాలు ఇందులో కీలకం.
ఆంధ్రప్రదేశ్ ర్యాంకు వివరాలు
పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 6వ స్థానం దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 8వ ర్యాంకు వచ్చింది. స్కోరు 48.7 శాతం. తెలంగాణకు 13వ ర్యాంకు, స్కోరు 47.3 శాతం. టాప్ పెర్ఫార్మర్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చోటు లేదు. ఫ్రంట్ రన్నర్‌లుగా గుర్తించిన రాష్ట్రాల్లో కూడా ఏపీ లేదు. టాప్ ఐదు స్థానాల్లో వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిశా ఉన్నాయి.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజ
దేశవ్యాప్తంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 25.3 శాతం వాటా ఉందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇది పెద్ద అచీవ్‌మెంట్‌గా చెప్పబడుతోంది. కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్‌ను అమలు చేస్తూ పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నట్లు చెబుతోంది. ఇది గతంలో టాప్ ర్యాంకులు సాధించిన ఏపీకి కొత్త గుర్తింపు తెచ్చింది. అయినప్పటికీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో టాప్ స్థానాలు దక్కకపోవడం విశ్లేషకుల్లో చర్చను రేపుతోంది.
ర్యాంకు తగ్గడానికి కారణాలు
ఈ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్కోరు ప్రభావితం కావడానికి ప్రధానంగా ఆర్థిక ఆరోగ్యం సంబంధిత అంశాలు కారణమని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అధికారికంగా రూ. 6.36 లక్షల కోట్ల అప్పు ఉండగా, అనధికారిక అప్పులు సుమారు 4 లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తం అప్పు భారం రూ. 10 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. 2019 నుంచి సంక్షేమ కార్యక్రమాలపై భారీగా ఖర్చు పెరగడం వల్ల ఆర్థిక వెసులుబాటు తగ్గింది. దీంతో వారం వారం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇండెక్స్‌లో ఆర్థిక ఆరోగ్యం సంబంధిత స్కోరును ప్రభావితం చేసింది. బిజినెస్ క్లైమేట్ సబ్–ఇండెక్స్‌లో ఏపీకి 9వ ర్యాంకు వచ్చింది. ఇందులో కూడా పెద్ద మార్పు లేదు.
పాలసీ స్థిరత్వం ప్రభవం..
గత కొన్నేళ్లలో రాజధాని విషయంలో గందరగోళం, పరిశ్రమల విధానంలో స్థిరత్వం లోపం కూడా ర్యాంకింగ్‌ను ప్రభావితం చేశాయి. 2019కి ముందు ఉన్న కొన్ని పాలసీలు నిలిపివేయడం లేదా మార్చడం వల్ల పెట్టుబడిదారులకు నిరంతరత్వం లోపించింది. గుజరాత్, తెలంగాణ వంటి రాష్ట్రాలు పాలసీల్లో స్థిరత్వం కొనసాగించి మెరుగైన ర్యాంకులు సాధించాయి.
విపక్షం అర్ధ సత్య ప్రచారం..
విపక్ష వైసీపీ ఈ ర్యాంకును పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పరిశ్రమలు పారిపోతున్నాయని, ప్రభుత్వం విఫలమైందని వాదిస్తోంది. అయితే ఇది పూర్తి చిత్రం కాదు. ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఏపీకి గణనీయమైన వాటా ఉండటం, కొత్త ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దష్టి పెట్టడం వాస్తవాలు. ర్యాంకు తగ్గడం అంటే పెట్టుబడులు రావడం ఆగిపోయిందని అర్థం కాదు.
ఆర్థిక క్రమశిక్షణ పెంచడం, అనవసర ఖర్చులు తగ్గించడం, పాలసీల్లో స్థిరత్వం తీసుకురావడం ద్వారా ఏపీ త్వరలోనే టాప్ పెర్ఫార్మర్ రాష్ట్రాల జాబితాలోకి చేరవచ్చు. పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ ఇప్పటికే ముందుంది. ఇప్పుడు అవసరం ఆ గమనాన్ని ఆర్థిక సుస్థిరతతో మిళితం చేయడం.
