Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత మన్నికైన పాలిమర్ కరెన్సీ నోట్లు తీసుకురావడానికి RBI చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా పాలిమర్ నోట్ల తయారీకి అవసరమైన మెటీరియల్, టెక్నాలజీ కోసం అంతర్జాతీయ టెండర్‌ను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోనే పాలిమర్ నోట్ల తయారీకి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ నోట్లు ఎలా ఉంటాయంటే?
దేశీయంగా తయారీ ప్లాంట్:
RBI జారీ చేసిన టెండర్ ప్రకారం.. Plastic లేదా Polymer నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్, టెక్నాలజీని భారత్‌లోనే అభివృద్ధి చేయనున్నారు. విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగా తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో భారీ స్థాయిలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీంతో “మేక్ ఇన్ ఇండియా” లక్ష్యానికి కూడా ఊతం లభించనుంది. పాలిమర్ నోట్లు ప్రత్యేక రకం ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాటన్ ఆధారిత కాగితం నోట్లతో పోలిస్తే ఇవి చాలా బలంగా, మన్నికగా ఉంటాయి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, సింగపూర్ వంటి అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీ నోట్లను విజయవంతంగా వినియోగిస్తున్నాయి.
వీటిని ఎలా తయారు చేస్తారు?
పాలిమర్ నోట్లు సాధారణ కాగితంతో కాకుండా బైయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలీప్రొపిలీన్ (BOPP – Biaxially Oriented Polypropylene) అనే ప్రత్యేక రకం ప్లాస్టిక్ ఫిల్మ్‌తో తయారు చేస్తారు. ఈ మెటీరియల్ చాలా బలంగా, తేలికగా, నీటిని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది. మొదట పాలీప్రొపిలీన్ ప్లాస్టిక్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి సన్నని షీట్లుగా తయారు చేస్తారు. ఈ షీట్లను ప్రత్యేక పద్ధతిలో రెండు దిశల్లో లాగి మరింత బలంగా మారుస్తారు. దీనినే BOPP ఫిల్మ్ అంటారు. తయారైన పాలిమర్ షీట్‌పై ప్రత్యేక కోటింగ్ వేస్తారు. ఈ కోటింగ్ వల్ల ఇంక్ బాగా అతుక్కుంటుంది. అలాగే నోటు మడిచినా, రుద్దినా డిజైన్ చెరిగిపోకుండా రక్షణ కల్పిస్తుంది.
అత్యాధునిక భద్రతా ఫీచర్లు:
పాలిమర్ నోట్లలో తయారీ దశలోనే అత్యాధునిక భద్రతా ఫీచర్లను అమర్చుతారు. పారదర్శక విండో హోలోగ్రామ్‌లు, మైక్రో ప్రింటింగ్, సెక్యూరిటీ స్ట్రిప్స్, ప్రత్యేక ఆప్టికల్ ఎఫెక్ట్స్ వంటి ఫీచర్లు నకిలీ నోట్లను అరికట్టేందుకు ఉపయోగపడతాయి. ఆ తర్వాత ప్రత్యేక హై-సెక్యూరిటీ ప్రింటింగ్ మెషీన్లతో నోటుపై రంగులు, చిత్రాలు, సంఖ్యలు, సీరియల్ నంబర్లు, వాటర్‌మార్క్ తరహా భద్రతా గుర్తులను ముద్రిస్తారు. ఈ ప్రింటింగ్ సాధారణ ప్రింటర్లతో అనుకరించడం దాదాపు అసాధ్యం. తయారైన ప్రతి బ్యాచ్‌పై కఠినమైన నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారు. నీటిలో నానబెట్టడం, మడవడం, రుద్దడం, అధిక ఉష్ణోగ్రతలు, చలిని తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అన్ని ప్రమాణాలు పూర్తి చేసిన నోట్లు మాత్రమే చలామణిలోకి విడుదల చేస్తారు.
నీటిలో పడినా నానిపోవు:
పాలిమర్ నోట్ల ప్రధాన ప్రత్యేకత వాటి మన్నిక. ఇవి నీటిలో పడినా నానిపోవు. వర్షంలో తడిసినా, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నా వాటికి పెద్దగా నష్టం ఉండదు. అలాగే దుమ్ము, ధూళి, మురికి సులభంగా అంటుకోదు. అందువల్ల నోట్లు చాలా కాలం పాటు శుభ్రంగా కనిపిస్తాయి. సాధారణ కాగితం నోట్లు తరచూ మడవడం, వాడకం వల్ల త్వరగా చిరిగిపోతాయి. కానీ పాలిమర్ నోట్లు చాలా బలంగా ఉండటంతో ఎక్కువకాలం ఉపయోగించవచ్చు. దీంతో కొత్త నోట్లు ముద్రించే ఖర్చు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ప్రభుత్వానికి భారీగా వ్యయభారం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాకిస్తాన్ కు భారీ షాక్:
ఫేక్ నోట్లను తయారు చేసి దేశంలోకి చొప్పిస్తున్న పాకిస్తాన్ కు ఇది భారీ షాక్ లాంటిది. ఎందుకంటే ఈ అక్రమ నిధులతోనే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. దీంతో ఇప్పుడీ అత్యాధునిక ప్లాస్టిక్ నోట్ల ద్వారా పాకిస్తాన్ అక్రమాలను కూకటి వేళ్లతో సహా పెకిలించవచ్చు
RBI టెండర్ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ, దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని కాగితం నోట్లను పాలిమర్ నోట్లతో భర్తీ చేసే నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. మొదట కొన్ని విలువ కలిగిన నోట్లతో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
