AP Liquor Scam : ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈడి రంగంలోకి దిగింది. ఏకకాలంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుండడంతో సంచలనాలకు వేదికగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సంచలన వార్త మీడియాలో హల్చల్ చేసింది. లిక్కర్ కుంభకోణంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి హస్తం ఉందన్నది ప్రచార సారాంశం. టిడిపి అనుకూల మీడియాతో పాటు అన్ని చానళ్లలో దీనిపై కథనాలు వచ్చాయి. అయితే దీనిపై సీరియస్ గా స్పందించారు భారతీ రెడ్డి. తన ప్రతిష్టను దెబ్బతీస్తూ.. తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు మీడియాపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈనాడు పత్రికకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే భారతీ రెడ్డికి వ్యతిరేకంగా ప్రధాన మీడియాతో పాటు ఛానల్ లలో కథనాలు వచ్చాయి. అయితే ఒక్క ఈనాడుకే లీగల్ నోటీసు పంపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* సంచలన అంశాలు..
ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team) విచారణలో తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 29 మంది పై కేసులు నమోదయ్యాయి. 12 మంది వరకు అరెస్టు జరిగింది. ఓ నలుగురు బెయిల్ పై బయటకు వెళ్లారు కూడా. మిగతావారు డిఫాల్ట్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే వైయస్ అనిల్ రెడ్డి పేరు వినిపించింది. ఆయన జగన్మోహన్ రెడ్డి పెదనాన్న జార్జి రెడ్డి కుమారుడు. చెన్నై కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆయన కంపెనీలో జగన్ సతీమణి భారతి డైరెక్టర్ గా ఉండేవారట. 2020 వరకు డైరెక్టర్ గా ఉండగా రాజీనామా చేశారు. అదే సమయంలో ఏపీలో మద్యం పాలసీ రూపొందించారు. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా మద్యం ముడుపులను బ్లాక్ నుంచి వైట్ గా మార్చుకున్నారు అన్నది ఒక ఆరోపణ. భారతి రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీల నుంచి ఈ లావాదేవీలు జరిగాయి కనుక కచ్చితంగా ఆమె ప్రమేయం ఉంటుందన్నది వార్త కథనాల సారాంశం.
* ఆమె అనిల్ రెడ్డి తల్లి.. ఈనాడులో( Eenadu) ప్రముఖంగా ఈ కథనం ప్రచురితం అయింది. సహజంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక మీడియా. దీంతో చాలా మీడియా ఛానల్లు దీనిపై కథనాలు ప్రచురించాయి కానీ.. భారతి రెడ్డి మాత్రం కేవలం ఈనాడుకు లీగల్ నోటీసులు పంపించారు. తాను ఏ కంపెనీల్లో డైరెక్టర్ కాదని కూడా తేల్చేశారు. తనకు ఆ కంపెనీలతో సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆమె డైరెక్టర్ గా ఉన్నట్లు తగిన నిర్ధారణ కూడా లేదు. వైయస్ అనిల్ రెడ్డి తల్లి పేరు కూడా భారతీ రెడ్డి. డైరెక్టర్గా ఏడుగురి సందింటి భారతి రెడ్డి అని మాత్రం ఉంది. దీంతో అందరూ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి అనుకున్నారు. అయితే అనిల్ రెడ్డి తల్లి పేరు కూడా భారతి రెడ్డి అని తాజాగా ఈనాడుకు ఇచ్చిన లీగల్ నోటీసుల ద్వారా బయటపడింది. తద్వారా జగన్మోహన్ రెడ్డి సతీమణి కాదని వెలుగు చూసింది. అయితే భారతీ రెడ్డి కేవలం ఈనాడుకు మాత్రమే లీగల్ నోటీసులు ఇవ్వడం అనేది గమనించదగ్గ విషయం.