AP Govt Jobs : నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వైసీసీ సర్కారు కసరత్తు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క సచివాలయం సహాయకుల పోస్టులు తప్పించి ఏ ఇతర నియామకాలేవీ చేపట్టలేదు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పెల్లుబికింది. ఇదే పరిస్థితి సాధారణ ఎన్నికల్లో ప్రస్పుటమయ్యే చాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వరుసగా జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. జూన్ నుంచి వరుసగా నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.
20 నోటిఫికేషన్లు..
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రానున్న మూడు నెలల్లో ఈ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, ఇంజనీర్లు తదితర పోస్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రారంభమైన 111 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.ఇంకా.. గ్రూప్-4 ఫలితాలను సైతం ఈ నెల 3 వారంలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అనంతరం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
జాబ్ కేలండర్ ఏదీ?
విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఏటా ఉద్యోగాల భర్తీ కేలండర్ విడుదల చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ నాలుగేళ్లవుతున్నా అటువంటిదేమీ చేయలేకపోయారు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ చెక్ చెప్పేందుకు ఇప్పుడు భారీ నోటిఫికేషన్లకు సన్నాహాలు చేస్తున్నారు. 140 పోస్టులతో గ్రూప్ -1, 1000 పోస్టులతో గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. భారీగా లెక్చరర్ ఉద్యోగాలను సైతం భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400 డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికలే టార్గెట్..
అయితే ఇప్పటికే ప్రతిపాదనలతో ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన వెంటనే వరుసగా నోటిఫికేషన్లు జారీకానున్నాయి. పంచాయితీ రాజ్, ఇరిగేషన్ తదితర శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు సైతం నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇంకా వీటితో పాటు భారీగా టీచర్ ఉద్యోగాలను సైతం భర్తీ చేయనున్నారు. ఎన్నికల నాటికి భారీగా ఉద్యోగాల భర్తీగా చేపట్టాలన్నది జగన్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. మరోవైపు తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. గతంలో జనగ్ ఇదే హామీ ఇచ్చారు. నాలుగేళ్లవుతున్నా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలుడనుండడంతో.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారిలో ఆందోళన నెలకొంది.