Suryakumar Yadav: మళ్లీ అతడే దిక్కయ్యాడు.. సెలక్టర్ల చూపు మళ్లీ నంబర్ 1 ర్యాంకర్ వైపే..!

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ పేరును సెలక్టర్లు చేర్చలేదు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడిన టెస్ట్‌ , టీ20 సిరీస్‌లలో పేలవమైన ఫామ్‌ కారణంగా అతన్ని పక్కనపెట్టారు సెలెక్టర్లు. ఇప్పుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అద్భుత ఫామ్‌ చాటుతున్నాడు. దీంతో.. కేఎల్‌ రాహుల్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైతే..

Written By: Raj Shekar, Updated On : May 5, 2023 8:44 am
Follow us on

Suryakumar Yadav: ఎవరూ దొరక్కపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్లు ఉంది టీం ఇండియా పరిస్థితి. ఫాంలో లేడు.. పనికి రాడు అనుకున్న క్రికెటర్లే.. పరిస్థితుల ప్రభావంతో జట్టుకోలి వస్తున్నారు. తాజాగా సూర్యకుమార్‌ కూడా ఇలా చాన్స్‌ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ముగిసిన వెంటనే.. భారత జట్టు జూన్‌ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆడుతుంది. అయితే, ఈ మెగా ఫైట్‌కు ముందు టీమిండియా గాయాలతో బాధపడుతుంది. ఈ గాయాలే సూర్యకు వరంగా మారే చాన్స్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

ఐపీఎల్‌ 2023 సీజన్‌ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు బయలుదేరనుంది టీమిండియా. ఈ మెగా ఫైట్‌ లో టీమిండియాను హాట్‌ ఫేవరేట్‌గా పరిగణిస్తున్నారు. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన భారత్‌.. గతేడాది న్యూజిలాండ్‌తో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టీం ఇండియాకు గాయాల బెడద..
ఈసారి ఫైనల్‌ లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే టీమిండియా స్వా్కడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు. అయితే, ఈ మెగా ఫైట్‌కు ముందు టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గాయాలతో చాలా మంది ఆటగాళ్లు సతమతమవుతున్నారు. కేఎల్‌.రాహుల్, జయదేవ్‌ ఉనాద్కత్, ఉమేష్‌ యాదవ్‌ గాయాలతో బాధపడుతున్నారు. అయితే మంచి విషయం ఏమిటంటే గాయపడిన ప్రతి ఆటగాడికి బదులుగా టీమిండియాకు మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టెస్టు అరంగేట్రంలోనే ఫ్లాప్‌ అయిన సూర్యకుమార్‌యాదవ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

మళ్లీ సూర్యకుమార్‌కు చాన్స్‌..
ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ పేరును సెలక్టర్లు చేర్చలేదు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడిన టెస్ట్‌ , టీ20 సిరీస్‌లలో పేలవమైన ఫామ్‌ కారణంగా అతన్ని పక్కనపెట్టారు సెలెక్టర్లు. ఇప్పుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అద్భుత ఫామ్‌ చాటుతున్నాడు. దీంతో.. కేఎల్‌ రాహుల్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైతే.. సెలెక్టర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ను సెలెక్ట్‌ చేసే అవకాశం ఉంది. సూర్య టీ20 ర్యాంకింగ్స్‌ లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో విధ్వంసం..
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సూర్య మళ్లీ విధ్వంసకర బ్యాటింగ్‌ తో బౌలర్లను భయపెడుతున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో సూర్య విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండు మ్యాచుల్లో కూడా ముంబై 200కు పైగా టార్గెట్‌ ఛేజ్‌ చేసింది. పంజాబ్‌ కింగ్స్‌పై సూర్య 31 బంతుల్లో 212 స్ట్రైక్‌ రేట్‌తో 66 పరుగులు చేశాడు. అదే సమయంలో రాజస్థాన్‌పై 29 బంతుల్లో 55 పరుగులు చేశాడు.

టెస్టుల్లో ఫెయిల్యూర్‌..
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో తన అరంగేట్రం టెస్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత అతన్ని పక్కనపెట్టారు. కేవలం 1 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ గాయపడటం.. కేఎల్‌ రాహుల్‌ ఆడే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మిడిలార్డర్‌ లో సూర్యను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక.. జయదేవ్‌ ఉనాద్కత్‌ కూడా గాయంతో దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అతని స్థానంలో వెటరన్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఇషాంత్‌. ఇప్పటికే అజింక్యా రహానే.. తన సూపర్‌ బ్యాటింగ్‌తో డబ్ల్యూటీసీ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.