Vizag Tourism Offer: విశాఖ( Visakhapatnam) పర్యాటక నగరం. సువిశాల సముద్ర తీరం, చూడ చక్కటైన బీచ్ లు, పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఎక్కువమంది విశాఖ అంటే ఆసక్తి చూపుతారు. విశాఖ నగరం అంటే ఇష్టపడతారు. ప్రస్తుతం పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ విశాఖలో పర్యాటకుల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘ట్రావెల్ యూత్ యు లైక్’ పేరుతో రోజంతా రూ.100 తో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ఇటీవల స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి పెరిగింది. అందులో మహిళల సంఖ్య అధికంగా ఉంది. దీంతో కుటుంబంలో పురుషుల కోసం ఈ కొత్త విధానం అమలు చేస్తోంది. తద్వారా కుటుంబమంతా తక్కువ డబ్బులతో విశాఖ నగరంలో ఇట్టే తిరగవచ్చు. పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు.
Also Read: ఆరేళ్ల కిందటి అదానీ ప్రాజెక్ట్.. కొత్తగా 2,400 ఎకరాలు.. అసలేంటి కథ!?
చాలా పర్యాటక ప్రాంతాలు..
విశాఖ నగరంలో చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రామకృష్ణ బీచ్( Ramakrishna Beach), కైలాసగిరి, రిషికొండ బీచ్, భీమిలి బీచ్, ఎండాడ బీచ్.. ఇలా ప్రతి బీచ్ ప్రత్యేకమే. దాదాపు ఈ బీచ్ ల మధ్య దూరం 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరోవైపు నగరంలో ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్, తొట్లకొండ, సింహాచలం, విశాఖ స్టీల్ ప్లాంట్.. ఇలా అన్నీ ప్రత్యేకమే. శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు తగరపువలస నుంచి సిటీలోకి ప్రవేశిస్తారు. అనకాపల్లి తో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలు.. అగనంపూడి తో విశాఖ సిటీలో అడుగు పెడతారు. అటు అరుకు మార్గం నుంచి కూడా పెందుర్తి నుంచి నగరంలో అడుగు పెడతారు. దాదాపు 100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నగరంలో.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వంద రూపాయలతో ప్రయాణం చేసి అరుదైన అవకాశం కల్పించింది ఏపీఎస్ఆర్టీసీ.
Also Read: లగేజ్ తో రైలులో ప్రయాణం చేస్తున్నారా?
డబ్బులు ఆదా..
ఆర్టీసీ( APSRTC) తీసుకొచ్చిన ఈ టికెట్ కొనుగోలు చేస్తే డబ్బులు ఆదాతో పాటు నగర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా ప్రయాణం చేయవచ్చు. ఒక మనిషి రోజంతా ఈ టికెట్ వినియోగించుకోవచ్చని చెబుతోంది ఆర్టిసి. విశాఖలో సందర్శనీయ ప్రాంతాలను చూడాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఈ టికెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోవచ్చు. కండక్టర్ వద్ద ఉండే టిమ్ యంత్రంలో వివరాలు నమోదు చేసిన వెంటనే ఈ ప్రత్యేక టిక్కెట్ ఇస్తారు. అయితే నగరంలో వివిధ పనులపై వచ్చిన వారు, మార్కెటింగ్ వ్యాపారం చేసేవారు, పర్యాటక ప్రాంతాలను చూడాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.