APPSC New Chairperson: ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనురాధ గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోం సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించగా.. గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన రాజీనామా చేయడంతో కొన్ని నెలలుగా ఆ పదవి ఖాళీగా ఉంది. దీంతో అనురాధ నియామకం అనివార్యమైంది. ఈ మేరకు సీఎంవో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అనురాధ గతంలో ఆమె ఇంటలిజెన్స్ చీఫ్, హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 1987లో ఐపీఎస్ గా అనురాధ తన కెరీర్ మొదలుపెట్టారు. 2023లో ఆమె తన విధుల నుంచి రిటైర్ మెంట్ అయ్యారు. మాజీ ఐఏఎస్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన ఆమె మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారే. ఏపీపీఎస్సీ బాధ్యతలను అప్పగించే విషయంలో ఏపీ ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలించింది. చివరకు అనురాధ నియామకానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపింది.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్స్ నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్ల టీడీపీ ఆరోపణలు చేసింది. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, తమకుకావాల్సిన వారికి మేలు చేసేందుకు ఒకటికి రెండు మూడు సార్లు మూల్యంకనం చేశారని టీడీపీ ఆరోపించింది. ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. మరో ఏడాది పదవీ కాలం ఉన్నా గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత మూడు నెలలుగా ఏపీపీఎస్సీకి చైర్మన్ లేకుండా పోయింది. చైర్మన్ లేకపోవడంతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ముందుకు కదలడం లేదు. ఇప్పటికే ప్రకటించిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు ఆగిపోయాయి. మరి కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల తేదీలు కూడా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెడతారో అన్న చర్చలు నడిచాయి.
ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి రేసులో పలువురు మాజీ ఐపీఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య, పోలా భాస్కర్ ల పేర్లు వినిపించాయి. అలాగే కేరళలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్, గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ పనిచేసిన అప్పారావు, యలమంచిలి రామకృష్ణల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ఏపీపీఎస్సీ ప్రతిష్టను పెంచడం.., పరీక్షల నిర్వహణ, ఉద్యోగ నియామకాలు వివాదాలకు తావు లేకుండా చేపట్టే క్రమంలో ఏఆర్ అనురాధకే మొదటి ప్రాధాన్యం లభించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇవాళ ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Andhra pradesh government appoints retired ips officer anuradha as the new chairperson of appsc
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com