Andhra Pradesh fuel crisis: నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత వాహనదారులను, రైతులను ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ దొరకక ప్రజలు ఇబ్బంది ఫడుతున్నారు. బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. అయినా ఇంధనం దొరకని పరిస్థితి. చివరకు 108కు కూడా ఇంధన కష్టాలు మొదలయ్యాయి. అయితే ఈ సమస్యకు కారణం ఇంధనం కొరత కాదని, అధికారులు చెబుతున్నారు. నిర్వహణలోపం సంక్షోభానికి కారణమని పేర్కొంటున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత సంవత్సరం కంటే ఎక్కువ సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపినప్పటికీ, తెరచాటున రిటైల్ ఔట్లెట్లకు పరిమితులు విధించడం వల్ల డిమాండ్‌కు తగిన సరఫరా జరగడం లేదు. ఇండెంట్ పెట్టినా వాణిజ్య వినియోగదారులకు మళ్లిస్తున్నామనే సాకుతో ఇంధనం పంపకం తగ్గించడంతో బంకుల్లో స్టాక్ త్వరగా అయిపోయింది. అందుకే రెండు రోజుల డిమాండ్ ఒక్క రోజులోనే ముగిసిపోవడం, తద్వారా షార్ట్ లేదు అన్న అపోహ – కొరతను ఇంకో స్థాయికి తీసుకెళ్లింది.
ఐఓసీఎల్ ఏకపక్ష నిర్ణయం..
అత్యధిక వాటా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఔట్లెట్లకు సరఫరా కోత పెట్టడం కీలక కారణం. డీజిల్ ధరలు పెరగగా, పెద్ద ప్రాజెక్టులు పనిచేసే సంస్థలు ప్రభుత్వ రంగ బంకుల వద్దకు మళ్లడంతో అక్కడ ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడిని ఐఓసీఎల్ ఉపశమనంగా కాకుండా నియంత్రణగా చూసి పరిమితులు విధించింది. ఇది ఒక ఏకపక్ష విధానం. ఆ నిర్ణయం వల్లనే ఆంధ్రప్రదేశ్ మాత్రమే దేశంలో ఈ స్థాయి కొరత ఎదుర్కొంది.
పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యం..
పౌర సరఫరాల శాఖ ముందు జాగ్రత్తగా సరఫరా పరిస్థితిని పర్యవేక్షించి ఉంటే ఇలాంటి స్థితి వచ్చే అవకాశం తక్కువ. సంస్థలు సరఫరా కోతలు పెట్టి పూర్తి వివరాలు చెప్పిన తర్వాత కూడా ఆ శాఖ సమస్యను యుద్ధరీతిలో చూడలేదు. బల్క్ వినియోగదారులు ప్రభుత్వ రంగ బంకుల దగ్గరకు మళ్లినప్పుడు వారితో ఆయిల్ కంపెనీలు మాట్లాడి పరిష్కరించవచ్చు. కానీ ఆ శాఖ స్పందన కేవలం కేంద్ర ప్రభుత్వం వల్ల అనుమతి తక్కువగా ఉంది అనే నిర్లక్ష్య స్వరంతో ముగిసింది. కొరత మొదలయ్యాక కూడా ఇంధన వ్యవస్థ పూర్తిగా కూలిపోక ముందు జోక్యం చేసుకుని ఉంటే సంక్షోభం ఇంత దీర్ఘమయ్యేది కాదు.
ప్రైవేట్ సంస్థలు ఇలా..
ప్రైవేట్ పెట్రోలియం సంస్థలైన నయార, రిలయన్స్ జియో, షెల్ లాంటి ఎంట్రీలు మొదలయ్యాక ఫిబ్రవరి వరకు భారీ ప్రాజెక్టులవారు వారి నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేస్తూ వచ్చారు. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగగా, వారు కూడా అమ్మకాలు తగ్గించారు. ధరలను పెంచారు. ఫలితంగా ఆ బల్క్ వినియోగదారులు తిరిగి ప్రభుత్వ రంగ బంకుల వద్దకు మళ్లడం జరిగింది. ఈ మార్పు ప్రభుత్వ రంగ సంస్థల పై డిమాండ్ భారాన్ని మరింత పెంచింది.
ఆదివారం పనిచేయించాలన్నా..
సెలవుదినమైన ఆదివారం కూడా పెట్రోల్ సంస్థలు పనిచేసి ట్యాంకర్లు పంపాలని పౌర సరఫరాల శాఖ సూచించినా, అది పాక్షికంగా మాత్రమే అమలయింది. హెచ్‌పీసీఎల్ కొంత వరకు ట్యాంకర్లు పంపినా, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి పెద్ద సంస్థలు యథాప్రకారం సెలవు తీసుకోవడం వల్ల ఆదివారం కొరత ఇంకా తీవ్రమైంది. సోమవారం తెల్లవారుజాము నుంచి జిల్లా కలెక్టర్లు నేరుగా జోక్యం చేసుకుని డిపోల నుంచి ట్యాంకర్లు పంపించడంతో మాత్రమే స్థితి కొంచెం స్థిరపడింది. ఇదంతా సమస్య మొదట్లోనే నిర్మూలించాల్సింది.
ఈ సంక్షోభం ఒక్కసారి మాత్రమే కాదు, యుద్ధం వల్ల ధరలు మారే ప్రపంచ వాస్తవానికి భారత్ సిద్ధం కాలేదని చూపిస్తుంది. ఆయిల్ కంపెనీలు సరఫరా పరిమితులు విధించినప్పుడు, ప్రభుత్వం వెంటనే బల్క్ ఇంధన వినియోగదారులకు ప్రత్యామ్నాయం చూపించాలి.
