Uttam Kumar Reddy : కౌశిక్ రెడ్డి, గాంధీ మధ్య సవాళ్లు కొనసాగుతుండగానే.. చంద్రబాబును ఉత్తమ్ ఎందుకు కలిశారు?

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. వీరిద్దరి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఏకంగా దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఉత్కంఠ వాతావరణం చోటుచేసుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 13, 2024 1:32 pm

Uttam Kumar Reddy

Follow us on

Uttam Kumar Reddy : అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య జరుగుతున్న వివాదంలో ప్రాంతీయ వాదం కూడా తెరమీదకి వచ్చింది. కౌశిక్ రెడ్డి ఏకంగా గాంధీని ఉద్దేశించి బతకడానికి వచ్చిన ఆంధ్రా వ్యక్తి అని విమర్శించారు. తెలంగాణ పౌరుషం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఇదే సమయంలో ప్రాంతీయ విభేదాలు మరోసారి తెరమీదకి వచ్చాయి. ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగానే.. ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాజకీయంగా వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీరి భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ప్రభుత్వపరంగా ఎలాంటి అంశాలను చర్చించారనే విషయంపై కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తన భార్యతో కలిసి..

చంద్రబాబు నాయుడిని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యతో కలిశారు.. ఈ సందర్భంగా చాలాసేపు వారు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఉత్తంకుమార్ రెడ్డి తన బాల్యమిత్రుడిని పరామర్శించడానికి విజయవాడ వెళ్లారని ఆయన అనుచరులు వివరిస్తున్నారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన చంద్రబాబును కలిశారని తెలుస్తోంది. అయితే వీరిద్దరి భేటీ వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని.. ప్రభుత్వపరమైన కార్యాచరణ కూడా లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అయితే వీరిద్దరి భేటీ వెనుక రహస్యం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ భేటీని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతుంది.

అప్పట్లో ఉత్తంకుమార్ చొరవ..

గతంలో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబుతో సత్సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతో దూర దృష్టితో ఉత్తంకుమార్ రెడ్డిని చంద్రబాబు వద్దకు పంపించినట్టు తెలుస్తోంది. కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారాన్ని చేపట్టింది. ఈసారి అనుకున్న మెజారిటీ రాకపోవడంతో బిజెపికి నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు. వీరిద్దరి మద్దతు వల్లే మూడోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే ప్రస్తుతం నితీష్ కుమార్ బిజెపి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన తన మద్దతును ఉపసంహరించుకుంటే కచ్చితంగా కాంగ్రెస్ పంచన చేరుతారని.. అది కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు మద్దతు కూడా తీసుకుంటే మరింత బలం సొంతమవుతుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని తెలుస్తోంది. అందువల్లే కాంగ్రెస్ అధిష్టానం దూతగా ఉత్తంకుమార్ రెడ్డిని పంపించిందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చంద్రబాబును ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత ఉత్తంకుమార్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ఇది సాధారణ సమావేశం మాత్రమేనని.. తన బాల్యమిత్రుడిని పరామర్శించిన తర్వాత చంద్రబాబును కలిశానని.. ఇందులో రాజకీయాలకు ఆస్కారం లేదని ఆయన వెల్లడించారు.