AFG vs NZ: అంపైర్ల నిర్ణయంతో శుక్రవారం ఒక బంతి కూడా పడలేదు. కనీసం టాస్ కూడా వేసే అవకాశం లేకుండా మ్యాచ్ వరుణుడికి అంకితమైపోయింది. మైదానంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో..అవుట్ ఫీల్డ్ ఆటకు సహకరించలేదు.. మ్యాచ్ నిర్వహించాలని ఐదు రోజులపాటు ఎదురుచూసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వాస్తవానికి ఐదో రోజు మైదానం కాస్త ఆటకు సహకరిస్తుందని ఆటగాళ్లు భావించారు. కానీ అలా జరగలేదు. వర్షం పదేపదే కురవడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఒక బంతి కూడా పడకుండానే ఆఫ్గనిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ రద్దయింది. ఇదే సమయంలో అరుదైన రికార్డుల జాబితాలో చేరింది. ఆసియా ఖండంలో వర్షం వల్ల రద్దయిన తొలి టెస్ట్ మ్యాచ్ గా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ పోరాటం వినతికెక్కింది. ఆసియాలో 91 ఏళ్ల టెస్ట్ చరిత్రలో 730 మ్యాచ్ లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఈ రికార్డుకు గ్రేటర్ నోయిడా వేదికగా మారడం విశేషం. మొత్తంగా టెస్ట్ చరిత్రలో బంతి పడకుండానే రద్దయిన ఎనిమిదవ టెస్ట్ మ్యాచ్ ఇది.
డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక..
నోయిడా మైదానం లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఈ మైదానాన్ని బిసిసిఐ గతంలో నిషేధిత జాబితాలో పెట్టింది. ప్రస్తుతం దీనిని గ్రేటర్ నోయిడా మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో సరైన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవు. ఈ మైదానం నిర్వహణపై ఆఫ్ఘనిస్తాన్ బీసీసీఐపై మండిపడ్డారు. ఇలాంటి మైదానంలో క్రికెట్ ఎలా ఆడాలంటూ ప్రశ్నించారు. చివరికి మైదానం లోని ఔట్ ఫీల్డ్ పై కప్పడానికి టార్పాలిన్లు కూడా లేకపోవడంతో బీసీసీఐపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
1890 లో తొలిసారి..
1890లో తొలిసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మ్యాచ్ జరగాల్సి ఉండగా.. అది రద్దయింది. ఆ తర్వాత 1970లో ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ కూడా రద్దయింది.. మెల్బోర్న్ వేదికగా ఆ రికార్డు నమోదయింది. 1989లో డునె డిన్ వేదికగా పాకిస్తాన్ – న్యూజిలాండ్ మ్యాచ్ జరగాల్సి ఉండగా అది కూడా రద్దయింది. 1990లో గయానా వేదికగా వెస్టిండీస్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ కూడా ఒక బంతి పడకుండానే రద్దయింది. 1998 డిసెంబర్ నెలలో పైసలా బాద్ లో పాకిస్తాన్ – జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయింది. మరుసటి రోజు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య డునె డిన్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయింది. ఈ జాబితాలో నోయిడా వేదికగా జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్ – న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దయింది. ఒకవేళ ఈ మ్యాచ్ సక్రమంగా గనుక జరిగితే చరిత్రలో 2,459 టెస్ట్ గా నమోదయ్యేదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.