Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకు ఊహించని షాక్

1988లో వంగవీటి మోహన్ రంగ దారుణ హత్యకు గురయ్యారు. 1989 ఎన్నికల్లో ఆయన భార్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. తరువాత తెలుగుదేశం పార్టీ హవాతో ఆ కుటుంబం రాజకీయంగా తెరమరుగయ్యింది.

Written By: Dharma, Updated On : July 2, 2024 10:13 am

Vangaveeti Radhakrishna

Follow us on

Vangaveeti Radhakrishna: తొందరపాటు నిర్ణయాలు రాజకీయంగా కొందరిని సమాధి చేస్తాయి. రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతాయి. అటువంటి బాధితుడే వంగవీటి రాధాకృష్ణ. దివంగత వంగవీటి మోహన్ రంగా రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన రాధా.. అనుకున్న స్థాయిలో పొలిటికల్ కెరీర్ ను సాగించలేకపోయారు. తొందరపాటు నిర్ణయాలతో రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న రాధాకు.. ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని.. ఎమ్మెల్సీ ని చేసి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు. టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రయ్య పేరును ఖరారు చేశారు. దీంతో వంగవీటి అభిమానులకు నిరాశ తప్పలేదు.

1988లో వంగవీటి మోహన్ రంగ దారుణ హత్యకు గురయ్యారు. 1989 ఎన్నికల్లో ఆయన భార్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. తరువాత తెలుగుదేశం పార్టీ హవాతో ఆ కుటుంబం రాజకీయంగా తెరమరుగయ్యింది. కానీ ప్రతి ఎన్నికల్లోను వంగవీటి మోహన్ రంగా పేరును అన్ని పార్టీలు వాడుకుంటూ వచ్చాయి. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి వంగవీటి రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాధా.. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తిగా రికార్డ్ సాధించారు. కానీ 2009లో తప్పటడుగులు వేశారు రాధాకృష్ణ. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు రాధాకృష్ణ. 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. మరోసారి ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికలకు ముందు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు రాధా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుపట్టారు. జగన్ వద్దు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. దీంతో ససేమిరా అన్న రాధా పార్టీ నుంచి నిష్క్రమించారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో టిడిపికి ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. టిడిపి అద్భుత విజయం సాధించింది. అయితే ఎన్నికల ప్రచార సభల్లో రాధాకృష్ణ చురుగ్గా పాల్గొనడంతో.. ఆయన సేవలను చంద్రబాబు గుర్తించారు. అందుకే రంగా వారసుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. మంత్రిగా అవకాశం ఇస్తే బాగుంటుందని చంద్రబాబు ఆలోచన చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ తరఫున రామచంద్రయ్య పేరును ఖరారు చేశారు. మరోసారి వంగవీటి అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే ఇప్పటికే ఆవేశపూరిత నిర్ణయాలతో రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు రాధాకృష్ణ. అందుకే టిడిపిలో అవకాశం దక్కుతుందని.. యాక్టివ్ రాజకీయాలకు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ భావిస్తున్నారు. మరి ఆయన విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎటువంటి అవకాశాలు కల్పిస్తారో చూడాలి.