Amit Shah: ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకొంటోంది. ఈనెల 11 వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి గడువు ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ ఈరోజు ఏపీలో పర్యటించనున్నారు. రాజమండ్రి తో పాటు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే భారీ బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ లు వేదిక పంచుకోనున్నారు.దీంతో ఈ ప్రచార సభలకు మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశాయి. గత నెలలో చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇప్పుడు రెండోసారి ఏపీకి రానున్నారు. ఈనెల 8న మరోసారి విచ్చేసి ఫైనల్ టచ్ ఇవ్వనున్నారు.
అయితే ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. గత నెలలో చిలకలూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ వైసీపీని పెద్దగా టార్గెట్ చేసుకోలేదు. జగన్ సర్కార్ పై కామెంట్స్ చేయలేదు. కేవలం షర్మిల, జగన్ కలిసి నాటకం ఆడుతున్నారని.. ఎన్డీఏ ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. మంత్రులు అవినీతిలో కూరుకు పోయారని మాత్రమే ఆరోపణలు చేశారు. దీంతో రకరకాల అనుమానాలకు అప్పట్లో తావిచ్చినట్లు అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షాలకు మద్దతుగా బిజెపి అగ్ర నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు హాజరయ్యారు. ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ పై పెద్దగా దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అటు కీలక అధికారుల బదిలీల విషయంలో సైతం తెలుగుదేశం పార్టీ మాట వినలేదన్న కామెంట్స్ వినిపించాయి. అన్నిటికీ మించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన సమయంలో బిజెపి అగ్రనేత ఒకరు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడం కూడా.. అధికార పక్షానికి అస్త్రంగా మారింది. ఈ అనుమానాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈరోజు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే అమిత్ షా ఇప్పటికే ఏపీలో పర్యటించారు. అధికార వైసిపి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు తోనే అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. రెండో మాటకు తావు లేకుండా వైసీపీని అమిత్ షా టార్గెట్ చేయగలిగారు.వైసిపి విషయంలో బిజెపి ఉదాసీనంగా వ్యవహరించడం లేదని సంకేతాలు పంపించగలిగారు.అయితే ఇప్పుడు ప్రధాని పర్యటనలోఆయన ఏం మాట్లాడతారన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా విశాఖ స్టీల్ అంశంపై ప్రధాని మోదీ ప్రస్తావిస్తారా? అమరావతి పై ఏదైనా నిర్ణయం ప్రకటిస్తారా? పోలవరం విషయంలో వైసిపి పై అవినీతి ఆరోపణలు చేస్తారా? అన్నింటికీ మించి వైసీపీతో తమకు సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే అమిత్ షా ప్రకటన తర్వాత.. ప్రధాని మోదీ పర్యటన పైనే సర్వత్రా ఉత్కంఠ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.