Amaravathi : అమరావతిలో( Amaravathi ) సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా అమరావతిపై నిర్లక్ష్యం కొనసాగింది. పూర్తిగా నిర్వీర్యం అయింది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతికి ఊపిరి పోసింది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఉగ్ర దాడుల నేపథ్యంలో జాతీయస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. కానీ చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నంతసేపు ఆ ప్రాంగణం దద్దరిల్లింది. ప్రజల కేరింతలు, చప్పట్లతో మార్మోగింది. ప్రధానంగా ప్రధాని చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. ఆ సమయంలో చంద్రబాబు నవ్వుతూ కనిపించారు. చంద్రబాబుపై తనకు అపార నమ్మకం ఉందని.. అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తారని ప్రధాని మోదీ ప్రకటించారు.
* దుర్గా భవానీని కొలుస్తూ ప్రసంగం..
దుర్గ భవానీ కొలువైన పుణ్య భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ మోడీ( Prime Minister Narendra Modi) తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది కేవలం శంకుస్థాపనలు కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, వికసిత్ భారత్ కు నిదర్శనాలు. ఒక స్వప్నం సాకారం అవుతుందనే విషయం కళ్ళ ముందు కనిపిస్తోందన్నారు. ఒక ఉత్తమమైన పనిని ప్రారంభించాలన్నా.. దానిని మెరుగ్గా.. వేగంగా పూర్తి చేయాలన్నా.. దేశంలో ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అని ప్రధాని మోదీ స్పష్టం చేయడం విశేషం.
* క్షిపణి కేంద్రానికి శంకుస్థాపన..
అంతకుముందు జాతీయ క్షిపణి కేంద్రం ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కృష్ణ జిల్లా నాగాయలంక( Nagaya Lanka ) మండలంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.1500 కోట్ల ప్రాథమిక వ్యయంతో దీని నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. దీనిని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ భారత అంతరిక్ష ప్రయోగాల కేంద్రంగా ఉందని గుర్తు చేశారు. శ్రీహరికోట నుంచి జరిగే ప్రతి రాకెట్ ప్రయోగం.. యావత్తు దేశవాసులను ఉత్తేజం కలిగిస్తోందని చెప్పారు. నాగాయలంకలో డిఆర్డిఓ మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసుకోబోతున్నాం అంటూ సగర్వంగా ప్రకటించారు. ఇది భారత రక్షణ, పరిశోధన రంగానికి మరింత ఊతం ఇస్తుందని చెప్పారు.
* పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం..
మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై( polavaram project) కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏపీ ప్రభుత్వంతో కలిసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని తేల్చి చెప్పారు. ఒకప్పుడు ఏపీ తెలంగాణకు రైల్వే బడ్జెట్ 900 కోట్ల రూపాయల లోపే ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఒక్క ఏపీకే 9వేల కోట్ల రూపాయల రైల్వే నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఏపీలో కనెక్టివిటీ కి కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు. రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందన్నారు. ఇది ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
* రూ.58 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన..
అమరావతి రాజధాని( Amaravathi capital ) పనులతో పాటు రూ.58000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. సభా వేదిక పైనుంచి వర్చువల్ విధానంలో వాటికి శ్రీకారం చుట్టారు వీటిలో రూ.49,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమరావతిలో చేపడుతారు. మరో 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. చివరిగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు. అందుకు గుర్తుగా పైలాన్ ఆవిష్కరించారు. అమరావతికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన విజయవంతంగా పూర్తయింది.